అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…?

అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…?

Araku bus accident : అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…? ఆధ్యాత్మిక, విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా… బస్సు 300 లోయల అడుగులో పడడానికి బదులుగా కొండను ఢీకొని ఆగిపోయేదని భావిస్తున్నారు. ఘాట్‌రోడ్డులో డ్రైవింగ్ చేసే నైపుణ్యమే లేని డ్రైవర్ రాత్రి వేళ బస్సు నడపడం ప్రమాద తీవ్రతను పెంచింది. ఘాట్‌ రోడ్డులో అత్యంత ప్రమాదరకమైన మలుపు దగ్గర బ్రేకులు ఫెయిలవ్వడంతో బస్సు నియంత్రించడం కష్టంగా మారింది. అనంతగిరి మండలం డముకు-టైడాకు మధ్యలో 5వ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. రాత్రికి అరకులోనే స్టే చేద్దామని ప్రయాణికులు చెప్పిన మాటను డ్రైవర్ విని ఉన్నా ప్రమాదం తప్పేది.

హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబం, ఇతర బంధువుల ఈ నెల 10వ తేదీన ఉత్సాహంగా దినేష్ ట్రావెల్స్‌ బస్సులో ఆధ్యాత్మిక, విహార యాత్రకు బయలుదేరారు. విజయవాడ ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాలస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గురువారం రాత్రికి సింహాచలం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేసిన వారంతా…శుక్రవారం ఉదయం అరకు వెళ్లారు. బొర్రా గుహలతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు సందర్శించారు. ఆధ్మాత్మిక, పర్యాటక యాత్రలో చివరి కార్యక్రమంగా సింహాచలం అప్పన్నను దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నారు. లగేజ్ మొత్తం సింహాచలంలోనే ఉండడంతో….అరకు నుంచి సింహాచలానికి తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పటికే చీకటి పడింది. బస్సు బయలుదేరింది…కొంచెం దూరం రాగానే బస్సు బ్రేకులు ఫెయిలయినట్టు గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులకు విషయం చెప్పాడు. అంతే హాహాకారాలు మొదలయ్యాయి. ఆ క్షణం డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ప్రమాదం తప్పేది. బస్సు కుడివైపుకు తిప్పి ఉంటే కొండను ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయేది. బస్సులోని ప్రయాణికులంతా స్వల్పగాయాలతో బయటపడే అవకాశం ఉండేది. కానీ డ్రైవర్ బస్సును ఎడమవైపుకు తిప్పడం, అక్కడ అత్యంత ప్రమాదకర మలుపు ఉండడంతో…బస్సు అదుపుతప్పి….300 అడుగుల లోతులో పడిపోయింది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిమ్మచీకటి అలుముకొని ఉంది. బస్సులోని ప్రయాణికుల హాహాకారాలు విన్న స్థానికులు, అనంతగిరి మోటార్ యూనియన్ బృందం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎనిమిది నెలలు చిన్నారి నిత్య సహా నలుగురు మరణించారు. మృతులను సత్యనారాయణ, సరిత, లతగా గుర్తించారు. క్షతగాత్రుల్లో పదిమంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పన్నెండు మంది ఎస్‌.కోట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు ప్రమాదం జరిగిన తీరు చాలా భయంకరంగా ఉంది. నిజానికి స్థానిక యువత స్పందించకుండా ఉండి ఉంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. హెయిర్‌పిన్‌ బెండ్‌ దగ్గర లోయలోకి దూసుకెళ్లిన బస్సు దాదాపు 3వందల అడుగుల కిందకు దూసుకెళ్లింది. రాత్రి ఏడున్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే గిరిజన యువత స్పందించారు. ఘాట్‌రోడ్‌ నుంచి కిందకు వెళ్లాలంటే ప్రమాదకరంగా కిందకు దిగాల్సిందే. బస్సు ప్రమాద ప్రాంతానికి టెన్‌టీవీ చేరుకుంది.

అక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. అంత ఎత్తు నుంచి కింద పడ్డ బస్సు తుక్కుతుక్కయింది. ప్రయాణికుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. బస్సు ఎందుకు పనికిరాకుండా పోయింది. నిజానికి బస్సు ఇంకొంచెం లోయకు వెళ్లి ఉంటే ప్రమాద తీవ్రత మరీ ఎక్కువగా ఉండేది. అదృష్టవశాత్తూ గిరిజనులు స్పందించారు. ప్రమాదకరంగా ఉన్నా కిందకు దిగారు. అతికష్టమ్మీద గాయపడ్డవారిని బయటకు తీసుకురాగలిగారు.

అరకు ఘాట్‌రోడ్డులో త్వరలోనే విస్తరణ పనులు చేపట్టనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమతులు వచ్చాయని.. తొందర్లోనే విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. నిన్నటి బస్సు ప్రమాదంపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.