అశోకుడి మౌనం : రాజకీయాల్లో కొనసాగుతారా? కేడర్ డీలా!

  • Published By: sreehari ,Published On : December 26, 2019 / 02:37 PM IST
అశోకుడి మౌనం : రాజకీయాల్లో కొనసాగుతారా? కేడర్ డీలా!

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కానీ, మొన్నటి ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. ఆ తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు పెరిగింది. అయితే, జిల్లా టీడీపీలోకి ఎవరు వచ్చినా, వెళ్లినా…. పార్టీకి పెద్ద దిక్కు మాత్రం ఎప్పుడూ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజే.

జిల్లాలో కుదేలైన టీడీపీ : 
పార్టీ ఆవిర్భావం నుంచి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని… రాజుల కోటను టీడీపీకి కంచుకోటగా మార్చారాయన. జిల్లా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… ఎవరికి ఏ పదవిని అప్పగించాలన్నా… అశోక్ గజపతిరాజు ఆమోదం పొందాల్సిందే. జిల్లా పార్టీ వ్యవహారాల్లో వేరే నాయకులెవరూ వేలు పెట్టేందుకు కూడా సాహసించరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అశోక్ గజపతిరాజుపై ఉన్న గౌరవంతో జిల్లా వ్యవహారాల్లో కలుగజేసుకొనే వారు కాదు. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలవ్వడం పార్టీ పెద్ద అశోక్ గజపతిరాజు సైతం ఊహించని దెబ్బ.

టీడీపీ కేడర్ డీలా : 
ఎన్నికల వరకు మంచి ఊపు మీద ఉన్న టీడీపీ కేడర్ ఫలితాలొచ్చాక పూర్తిగా డీలా పడిపోయింది. పార్టీని నడిపించే నాథుడు లేక నాయకులతో పాటు కేడర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన అశోక్ గజపతిరాజు… ఆ తర్వాత అనారోగ్యంతో హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో రాజుల వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన అదితి గజపతిరాజు కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కాలంలో ఆమె కూడా దూరమయ్యారు.

అనారోగ్యంతో జిల్లాను విడిచి వెళ్లిన అశోక్ గజపతిరాజు… శస్త్రచికిత్స తదితర కారణాలతో సుమారు ఆరు నెలల వరకు జిల్లాలో కానరాలేదు. ఈ సమయంలో పార్టీ కేడర్ అంతా కకావికలమైపోయిందట. అప్పుడప్పుడు అధిష్టానం ఇచ్చిన పిలుపుతో తూతూ మంత్రంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహించినా అశోక్ లేని లోటు స్పష్టంగా కనిపించిందంటున్నారు.

ఇతర సీనియర్ నేతలైన సుజయ్ కృష్ణ రంగారావు, శత్రుచర్ల విజయరామరాజు, పతివాడనారాయణ స్వామి నాయుడు వంటి నేతలు జిల్లాలోనే ఉన్నప్పటికీ, వారి ప్రభావం పెద్దగా కానరాలేదంటున్నారు. దీంతో జిల్లాలో పార్టీని నడిపే నాథుడే లేడా అన్న సంకేతాలు పార్టీ కేడర్‌ను ఆందోళనలోకి నెట్టేశాయని అంటున్నారు.

బంగ్లాకే పరిమితమైన అశోక్ :
శస్త్రచికిత్స ముగిశాక కొన్ని రోజులు ఢిల్లీలో గడిపిన అశోక్… సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలనే మళ్లీ జిల్లాలోకి అడుగు పెట్టారు. అశోక్ గజపతిరాజు జిల్లాకు వచ్చేశారు… ఇక పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలు జోరందుకుంటాయని ఊహించారంతా. కానీ, అశోక్ మాత్రం జిల్లాకు వచ్చినప్పటి నుంచి తన బంగ్లాకే పరిమితమవుతున్నారట. పార్టీ కేడర్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.

స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో అశోక్ రీ-ఎంట్రీతో లెక్కలు మారతాయనుకుంటే ఆ పరిస్థితిలేవీ కనిపించడం లేదని జనాలు అంటున్నారు. వయోభారం, అనారోగ్య కారణాలతో రానురాను అశోక్ గజపతిరాజు రాజకీయాలకు దూరమవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి ఎవరు నడిపిస్తారనే ప్రశ్న పార్టీని వేధిస్తోందంట.