టోల్‌గేట్ సిబ్బందిపై దాడి.. ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రేవతిపై కేసు నమోదు

  • Published By: bheemraj ,Published On : December 10, 2020 / 06:56 PM IST
టోల్‌గేట్ సిబ్బందిపై దాడి.. ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రేవతిపై కేసు నమోదు

Case registered against AP Vaddera Corporation Chairperson Revathi : గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వివాదం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది. వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రేవతి దాడిపై టోల్‌ప్లాజా మేనేజర్‌ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రేవతిపై కేసు నమోదైంది. సెక్షన్‌ 188, 294, 294 బీ, 341, 506 కింద వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రేవతిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.



నిన్న ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి…టోల్‌గేట్ సిబ్బందిపై దాడి చేసింది. టోల్‌ఫీజు కట్టకుండా వెళ్తున్నారేంటని…ఆమెను ప్రశ్నించడమే సిబ్బంది పాపమయింది…అంతే ఇక కారు దిగి వీరంగం సృష్టించారు. తన కారుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లు విసురుగా తొలగించింది. టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ అందులో ఒకరిపై చేయిచేసుకుంది. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర ఈ ఘటన జరిగింది.



టోల్‌ఫీజు కట్టకుండా వెళ్తున్న రేవతి కారుకు అడ్డంగా బారికేడ్లు ఉంచారు సిబ్బంది. వెంటనే కారు దిగిన రేవతి.. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. నా కారుకు అడ్డంగా బారికేడ్లు పెడతారా..ఎంత ధైర్యం అంటూ వాటిని తోసేసింది.

టోల్ సిబ్బంది చెప్పే మాటలు వినిపించుకోకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవతి వీరంగంతో టోల్‌గేట్ సిబ్బంది, తోటి వాహనదారులు బెంబేలెత్తిపోయారు.



టోల్ సిబ్బందిపై రేవతి దాడి చేసే విజువల్స్ అక్కడి సిసికెమెరాలో రికార్డ్ అయ్యాయి. టోల్‌ప్లాజా సిబ్బంది ఫిర్యాదుతో బీసీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రేవతిపై కేసు నమోదు చేశామని మంగళగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు అసలు కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు.



అయితే తాను టోల్ సిబ్బందిపై దాడి చేశానని వస్తున్న వార్తలు అవాస్తవం అని వడ్డెర కార్పొరేషన్‌ చైర్ పర్సన్ రేవతి అన్నారు. మహిళా అని చూడకుండా సిబ్బంది తనతో దుర్భషలాడారని చెప్పారు. మహిళా అని చూడకుండా తనపై దాడి చేశారని తెలిపారు. ఇది మహిళా లోకానికి అన్యాయమన్నారు. లోకల్‌ రిజిస్ట్రేషన్‌ కార్డు ఉన్న… సిబ్బంది తనను అనుమతించలేదని పేర్కొన్నారు.



అయితే 8వ నెంబర్‌ నుంచి వెళ్లమన్నందుకు తమపై రేవతి దాడి చేశారని టోల్‌ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. రెగులర్‌ పాస్‌ ఉన్న వారు లైన్‌లో నుంచే వెళ్లాలంటున్నారు వారు.