Audimulapu Suresh: పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఏపీ మంత్రి

పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషని.. ఆయనొక సిద్దాంతం, భావజాలం లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్.

Audimulapu Suresh: పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఏపీ మంత్రి

Audimulapu Suresh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషని.. ఆయనొక సిద్దాంతం, భావజాలం లేదని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు తెరచాటుగా చంద్రబాబుతో రాజకీయ వ్యభిచారం
చేస్తున్నాడు. ఏ పార్టీతో ఏ సిద్దాంతం ప్రకారం పొత్తు పెట్టుకోబోతున్నాడో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మేము చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లబోతున్నాం. అదేవిధంగా ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నాడో పవన్ కళ్యాణ్ చెప్పాలని అన్నారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పేరిట భారీ అక్రమాలకు పాల్పడింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన లక్ష్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం

వాపును చూసి బలుపు అనుకుంటున్నారు
ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలనేది ఏమిలేవని సిఎం జగన్ స్పష్టత నిచ్చారు. సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేయడమే అందుకు నిదర్శనం. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. ప్రస్తుతం 175 స్థానాల్లో టీడీపీకి నాయకులే లేరు. 175 స్థానాల్లో టీడీపీ పోటీలో నిలబడబోతుందో, లేదో స్పష్టంగా చెప్పమనండి అంటూ వ్యాఖ్యానించారు.

కాగా, రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు సీనియర్ నాయకులను కలిశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత పవన్ మాట్లాడుతూ.. వైసీపీ
విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమని చెప్పారు. పొత్తులపై సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తామని అన్నారు.

Also Read: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?