YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్‌ ప్రో కో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు

Ys Jagan Sakshi

YS Jagan Mohan Reddy :  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్‌ ప్రో కో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షిని నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడుల కేసులో వైఎస్‌ జగన్‌కు, జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయపన్ను శాఖ అప్పీలెట్ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. జగతి పబ్లికేషన్‌లో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ తేల్చి చెప్పింది ఐటీ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌.

జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జ్‌షీట్లలో చాలా ముఖ్యమైన కేసు సాక్షిలో పెట్టుబడుల వ్యవహారం. జగన్‌ మోహన్‌ రెడ్డి ద్వారా అక్రమ పద్ధతుల్లో లబ్ది పొందిన పలువురు పారిశ్రామిక వేత్తలు అందుకు ప్రతిఫలంగా జగన్‌కు ముడుపులు అప్పజెప్పేందుకు జగతి పబ్లికేషన్స్‌లో భారీ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారనేది సీబీఐ ప్రధాన వాదన. ఓ రకంగా చెప్పాలంటే ఈ 11 ఛార్జ్‌షీట్లలో చాలా కీలకమైన కేసు ఇది. ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్ అప్పీలెట్ ట్రైబ్యునల్‌ జగతి పబ్లికేషన్స్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని గమనిస్తే, దీని ప్రభావం సీబీఐ కోర్టుల్లో జగన్‌పై విచారణలో ఉన్న వివిధ కేసుల్లో ఏ విధంగా ఉంటుందన్నది చాలా ఆసక్తికర అంశం.

Read Also : Akira Nandan: రేణూదేశాయ్-అకీరా నందన్‌కు కరోనా పాజిటివ్

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్.జగన్ ప్రారంభించిన జగతి పబ్లికేషన్స్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఒక్కో షేర్‌ను 350 రూపాయల ప్రీమియంకు అమ్మడం ద్వారా దాదాపు రూ.292 కోట్లను జగతి పబ్లికేషన్స్‌ సమీకరించింది. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో… ఈ పెట్టుబడులన్నీ క్విడ్‌ ప్రో కోలో భాగమంటూ సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది. వైఎస్సార్ సర్కార్ నుంచి లబ్ది పొందిన కంపెనీల అధిపతులు లంచాలను పెట్టుబడుల రూపంలో అధిక ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్లించాయంటూ ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది సీబీఐ.

ఈ ఛార్జ్ షీట్లను ఆధారంగా చేసుకుని.. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన రూ.292 కోట్ల పెట్టబడులను వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదాయంగా పరిగణిస్తూ పన్ను వేసింది ఐటీ శాఖ. దీన్ని సవాల్ చేస్తూ జగతి పబ్లికేషన్స్‌ ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రైబ్యునల్‌.. ఆదాయపన్ను శాఖ వేసిన పన్ను చెల్లదంటూ తీర్పు చెప్పింది. అంతేకాదు.. సూట్‌కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లూ ఆధారాలను ఐటీశాఖ చూపించలేకపోవడంతో.. క్విడ్‌ కో ప్రో ఆరోపణలను కొట్టిపడేసింది.

పది రూపాయల ముఖవిలువ కలిగిన షేర్ ధరను భారీగా పెంచి 350 రూపాయల ప్రీమియంకు అమ్మారంటూ వాదించింది ఐటీ శాఖ. జగతి పబ్లికేషన్స్‌ విలువను ఎక్కువగా చూపించడాన్నే ఈ కేసులో ఆధారంగా చూపించింది. సూట్‌కేస్ కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయంటూ సీబీఐ ఛార్జ్‌షీట్లలో పేర్కొన్న అంశాలనే ట్రైబ్యునల్ ముందు ఉంచారు ఐటీ అధికారులు.

అయితే.. జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చిన పెట్టుబడులన్నీ చట్టబద్ధంగానే వచ్చాయని తేల్చింది ట్రైబ్యునల్‌. ఏ ఒక్క కంపెనీ కూడా నగదు రూపంలో షేర్లను కొనుగోలు చేయలేదని.. వాటి బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారానే కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయంది. సాక్ష్యాలను పరిశీలించేటప్పుడు వాస్తవిక పత్రాలే ముఖ్యం తప్ప, ఆధారాల్లేని ప్రకటనలు కాదంటూ ఖరాఖండీగా తేల్చి చెప్పింది ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్‌.

ఇక సూట్‌ కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చాయన్న వాదనను కొట్టి పడేసింది ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్‌. చాలా సంస్థలు పేర్కొన్న చిరునామాలో వాటి కార్యాలయాలు లేవంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలిందంటూ ఐటీ శాఖ వాదించింది. అయితే.. కొన్ని కంపెనీలు తమ చిరునామా మారిందంటూ సంప్రదించినా కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించింది ట్రైబ్యునల్‌.

దీంతో.. సూట్‌ కేస్ కంపెనీ విషయంలోనూ ఆదాయపన్ను శాఖ చేసిన వాదన వీగిపోయింది. అంతేకాదు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీల ఆదాయంపై కోల్‌కతా ఆదాయపన్ను శాఖ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రస్తావించింది ట్రైబ్యునల్‌. షేర్ క్యాపిటల్‌ గానీ, ప్రీమియంగానీ పెట్టుబడిలో భాగంగానే చూడాలి తప్ప.. ఆదాయంగా చూడకూడదంటూ ఐటీ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పింది. జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులుగా వచ్చిన రూ.292కోట్లపై ఐటీ శాఖ వేసిన పన్నును రద్దు చేసింది.

సీబీఐ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లు ప్రధానంగా ఆరోపణలు మాత్రమేనని, వీటిని ఆధారంగా చూసుకుని ఆదాయపన్ను శాఖ నిర్ణయాలు తీసుకోరాదని ట్రైబ్యునల్‌ తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే సీబీఐ కోర్టులో దాఖలు చేసిన వివిధ పత్రాలను కోర్టు ఇప్పటివరకూ పరిగణనలోకి తీసుకోలేదని, వాటి మీద తీర్పును వెల్లడించలేదని, అందువల్ల సీబీఐ దాఖలు చేసిన స్టేట్‌మెంట్స్‌ను ఆధారంగా పరిగణించలేమని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది.
Also Read : Lata Mangeshkar covid : గాయని ల‌తా మంగేష్క‌ర్‌కు క‌రోనా..ఐసీయూలో చికిత్స‌
ఈ విషయంలో ఆదాయపన్ను శాఖ అధికారి స్వతంత్రంగా ఎలాంటి ఆధారాలను సేకరించలేదని ట్రైబ్యునల్‌ ప్రస్తావించింది. ఈ కేసులో కొన్ని కంపెనీల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఓ మెమోను ప్రస్తావించిన ట్రైబ్యునల్‌ … ఆ మెమోలో ఆ కొన్ని కంపెనీల మీద ఎలాంటి క్విడ్‌ ప్రో కో ఆధారం లేదని ప్రస్తావించినట్లు గుర్తు చేసింది. షేర్‌ మూలవిలువ క్విడ్‌ ప్రో కో కానప్పుడు… షేర్ ప్రీమియం క్విడ్ ప్రో కో ఎలా అవుతుందంటూ ట్రైబ్యునల్‌ ప్రస్తావించింది.

ఒక ప్రైవేటు కంపెనీలో షేర్ ప్రీమియం ఎంత అనేది ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి, కంపెనీకి మధ్య జరిగే వాణిజ్యపరమైన సంప్రదింపులు, వ్యాపార అంచనాల ఆధారంగా నిర్ణయం అవుతుందని జగన్‌ తరపు న్యాయవాది చేసిన వాదనలతో ట్రైబ్యునల్ ఏకీభవించింది. ఎక్కువ ప్రీమియం వసూలు చేయకూడదని చట్టంలో ఎక్కడా లేదని మరీ ట్రైబ్యునల్‌ పేర్కొంది. తాము వసూలు చేసిన ప్రీమియంకు మద్దతుగా జగతి పబ్లికేషన్స్‌ చేయించిన రెండు వాల్యుయేషన్ రిపోర్టులను ట్రైబ్యునల్ ప్రస్తావించింది. చట్టబద్ధమైన పరిధిలో ఉన్నంతవరకూ… షేర్‌ను ఏ ధరకు కేటాయించాలనేది ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధికార పరిధిలోకి వస్తుందని, ఆ షేర్లను కొనాలనే పెట్టుబడిదారుల విచక్షణకు లోబడి ఉంటుందని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

ఐటీ ట్రైబ్యునల్‌ తీర్పుతో జగతి పబ్లికేషన్‌ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. వైఎస్ జగన్‌పై సీబీఐ వేసిన ఛార్జ్‌షీట్‌లో కూడా క్విడ్‌ ప్రో కోనే ప్రధాన ఆరోపణ కాబట్టి.. ఆ కేసు విచారణలోనూ ఐటీ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ తీర్పును జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించే అవకాశం ఉంది.