BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్‌పై చంద్రబాబు రియాక్షన్!

పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్‌పై చంద్రబాబు రియాక్షన్!

Chandrababu

BheemlaNayak: పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు హడావిడి చేస్తుండగా.. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వదలట్లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.

భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ #BheemlaNayak సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వేధిస్తున్న జగన్.. తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం.

యుక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమ్లా నాయక్‌పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షం ఎత్తుకునేలా మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.