YSR Cheyutha : ఒక్కొక్కరికి రూ.18,750.. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.

YSR Cheyutha : ఒక్కొక్కరికి రూ.18,750.. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత

Ysr Cheyutha

YSR Cheyutha : కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ చేసింది. మంగళవారం(జూన్ 22,2021) క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్.

వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామని సీఎం అన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు.

నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు అని సీఎం జగన్‌ అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. అమూల్‌, రిలయన్స్‌, పీ అండ్‌ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం జగన్‌ తెలిపారు. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్‌ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం గతేడాది వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19వేల కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.