CM Jagan : స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు అందాలి.. పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి.

CM Jagan : స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు అందాలి.. పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan : నాడు నేడు పనులు పూర్తైన అన్ని స్కూళ్లలో ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. నాడు నేడు పనులు పూర్తైన స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ నిర్వహించాలని అన్నారు.

సౌకర్యాలు బాగున్నాయో లేదో పరిశీలించి అవసరమైన చోట్ల వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం స్కూల్ మెయింటెన్స్ ఫండ్ ను వాడుకోవాలని చెప్పారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని జగన్ చెప్పారు. వచ్చే ఏడాది విద్యాకానుక కిట్లను 2023 జూన్ నాటికి సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూల్స్ తెరిచే నాటికి యూనిఫామ్స్, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు అందించాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను క్రియాశీలకం చేయాలని ఆదేశించారు.

”వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి. స్కూళ్లలో ఎలాంటి సమస్యలున్నా తెలియజేసేందుకు వీలుగా 14417 టోల్ ఫ్రీ నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయాలి” అని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

”స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలి. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలి. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలి. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలి. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలి” అని అధికారులను ఆదేశించారు జగన్.

ఇక టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సమీక్షించారు సీఎం జగన్. 5లక్షల 18వేల 740 ట్యాబ్‌లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ ఉండనుంది. క్లాస్ రూమ్ లను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 72వేల 481 యూనిట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దశలవారీగా వీటిని క్లాస్ రూమ్స్ లో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు రూ. 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని సీఎం జగన్ చెప్పారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.