పవన్ కళ్యాణ్ సంగతి సరే, మీరు కూడా చాలా పెళ్లిళ్లే చేసుకున్నారు కదా.. నారాయణపై విమర్శల వెల్లువ

  • Published By: naveen ,Published On : October 10, 2020 / 12:16 PM IST
పవన్ కళ్యాణ్ సంగతి సరే, మీరు కూడా చాలా పెళ్లిళ్లే చేసుకున్నారు కదా.. నారాయణపై విమర్శల వెల్లువ

cpi narayana: సమయానుకూలంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. ఆనక చారిత్రక తప్పిదం చేశామంటూ కడిగేసుకోవడం.. మళ్లీ అదే పని చేయడం వామపక్ష పార్టీలకు అలవాటని రాజకీయ వర్గాల్లో వినిపించే వాదనలు. ఇప్పుడు మళ్లీ అదే పల్లవి అందుకున్నారు సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణ. గత ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను నమ్ముకొని తప్పు చేశామని చెప్పడంపై జనసేన నుంచే కాదు.. రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఒక్క బీజేపీతో తప్ప అన్ని పార్టీలతోనూ సీపీఐ దోస్తీ:
ఎన్నికలు ముగిసిన తర్వాత కొంత కాలానికి పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అది జరిగిన ఇంత కాలానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మేల్కొని, పవన్‌కల్యాణ్‌ను నమ్ముకొని పొత్తు పెట్టుకుంటే ఆయన బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. నాడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టి.. నేటి జనసేన వరకూ అన్ని పార్టీలతోనూ వామపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకొనే ఎన్నికల్లో పాల్గొంటూ వచ్చింది. ఒక్క బీజేపీతో తప్ప దాదాపు అన్ని పార్టీలతోనూ దోస్తీ చేసింది. కానీ, ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గానీ.. తమ స్వరాన్ని మార్చుకుంటూ రావడం కూడా అందరికీ తెలిసిందే.

పొత్తు పెట్టుకున్న సమయంలో మూడు పెళ్లిళ్ల గురించి నారాయణకు తెలియదా?
కాలంతో పాటు మారేందుకు వామపక్షాలు సిద్ధంగా లేవని జనాలు అంటున్నారు. ఆ పార్టీల్లో నాయకులు కూడా మారరని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తప్పుల్ని చేయడం, పాత తప్పుల్ని నెమరేసుకుంటూ లెంపలేసుకోవడం వామపక్ష నేతలకు పరిపాటి అని అంటున్నారు. జనసేనతో వామపక్షాల పొత్తు గురించి, ఆ తర్వాత బీజేపీకి జనసేనాని దగ్గరవ్వడం గురించి మాట్లాడి వదిలేస్తే సమస్య ఉండేది కాదు.. కానీ, పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్ల గురించి కూడా నారాయణ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పొత్తు పెట్టుకున్న సమయంలో ఆ విషయం నారాయణకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా పెళ్లిళ్లు చేసుకున్నాయని ఎద్దేవా:
కొత్త పార్టీ రాజకీయాల్లోకి వస్తే చాలు… వాటికి దగ్గరవ్వడమే కమ్యూనిస్టుల పని అని జనాలు అంటున్నారు. దీనివల్లే వారికి గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేకుండా పోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. నాడు ఎన్టీఆర్‌తో అంటకాగినప్పటి నుంచీ మొన్న పవన్ కల్యాణ్‌తో జతకట్టే వరకు కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా పెళ్లిళ్లు చేసుకున్నాయి కదా అని ఎద్దేవా చేస్తున్నారు. లెంపలేసుకోవడం, పశ్చాత్తాపం ప్రకటించడం ఆ పార్టీలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. బీజేపీతో పవన్‌ కల్యాణ్‌ కలవడం ఇష్టపడకపోతే ఎంచక్కా బైబై చెప్పుకోవచ్చు. మరో పార్టీతో పొత్తుకు ప్రయత్నం చేయొచ్చు.

కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో ఇలాంటి పార్టీ మార్పిడి వ్యవహారాలు ఎన్నో:
ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి.. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అనుకోవచ్చు. కానీ, అలాంటి అద్భుతాలేమీ జరగలేదు సరికదా.. కనీసం ప్రభావం కూడా చూపించలేకపోయింది. అలాంటప్పుడు సైలెంట్‌గా దూరమైపోతే పోయేదానికి అలాంటి వ్యాఖ్యలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మరో పార్టీతో పొత్తు కోసం ఎదురుచూడడం కామనే కదా అంటున్నారు. కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో ఇలాంటి పార్టీ మార్పిడి వ్యవహారాలు ఎన్నో జరిగాయని, అంత మాత్రాన ఇతర పార్టీలు వేరే వారితో పొత్తు పెట్టుకుంటే ఎందుకంతలా రియాక్ట్‌ అవుతారని అడుగుతున్నారు. మొత్తం మీద నారాయణ వ్యాఖ్యలు మరోసారి వామపక్షాలపై సెటైర్లు వేయడానికి అవకాశం ఇచ్చాయని జనాలు అంటున్నారు.