Cyclone : వణికిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళంపై గులాబ్ ప్రభావం

బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

10TV Telugu News

Cyclone Gulab : బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా, ఆ తర్వాత విజయనగరంపై తుఫాన్‌ ప్రభావం చూపించింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్రంలో రెండు మత్స్యకారుల పడవలు బోల్తా పడ్డాయి. వీరిలో ఒకరు గల్లంతు కాగా, మిగిలినవారు ఒడ్డుకు చేరుకున్నారు.

Read More : IPL 2021 RCB Vs MI హర్షల్ హ్యాట్రిక్.. ముంబైపై బెంగళూరు గెలుపు

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుఫాన్‌ తీరం దాటింది. దీని ప్రభావంతో సముద్రంలో అలలు సాధారణం కంటే మీటరు ఎత్తు వరకు ఎగిసిపడ్డాయ్‌. శ్రీకాకుళం జిల్లాలో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఉత్తరకోస్తాలో మిగిలిన ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి‌. శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉద్దానం ప్రాంతంలో అరటి, కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లింది.

Read More : Modi : కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆరు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అత్యధికంగా గార మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. తీరం దాటిన తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు వెల్లడించింది వాతావరణ శాఖ. కళింగపట్నానికి 50 కిలో మీటర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కు 170 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో 2021, సెప్టెంబర్ 27వ తేదీ సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

Read More : Virat Kohli: టీ 20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మొదటి భారతీయ బ్యాట్స్‌మన్!

గులాబ్‌ తుఫాన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కేంద్రం నుంచి తక్షణ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీ సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పీఎం మోదీ ట్వీట్‌ చేశారు. తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ప్రధాని మోదీకి చెప్పారు సీఎం జగన్‌.

×