అందమే శాపమయ్యింది.. అసూయతో దివ్యను హత్య చేసిన వసంత

  • Published By: murthy ,Published On : June 7, 2020 / 05:12 AM IST
అందమే శాపమయ్యింది.. అసూయతో దివ్యను హత్య చేసిన వసంత

విశాఖపట్నంలో సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే చేధించి నిందితులను అరెస్టు చేశారు.  బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి  జరిగిన పోస్టు మార్టంలో… దివ్యశరీరంపై 33  చోట్ల గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆమెతో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్న అక్కయపాలెం నందినగర్ కు చెందిన వసంత అనే మహిళే ఈ హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. 

బతుకు తెరువు కోసం వస్తే జీవితం తెల్లారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య(20) తల్లితండ్రులు మరణించటంతో  బతుకుతెరువు కోసం విశాఖపట్నంలోని వసంత (30) దగ్గరకు వచ్చింది. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వసంత, దివ్యను వ్యభిచార వృత్తిలోకి దింపింది. దివ్య అందాన్ని ఎరగా వేసి బాగా డబ్బులు సంపాదించింది. అందంగా ఉన్న దివ్యను చూసి వసంతకు అసూయ, ద్వేషాలు పెరిగిపోయాయి. దివ్యను మట్టు బెట్టాలనినిర్ణయించుకుంది. ముందుగా దివ్య అందాన్నిచెరిపేయాలని నిర్ణయించుకుంది. ఇంట్లో బంధించి వారంరోజుల పాటు  వివిధ రీతుల్లో  చిత్ర హింసలకు గురిచేసింది. ఈ బాధలు భరించలేని దివ్య బుధవారం రాత్రి మృతి చెందింది.

అంతిమయాత్ర వాహనం యాజమాని ద్వారా పోలీసులకు సమాచారం
దివ్య మరణించాక.. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్‌ చేసింది వసంత. అతను వివిరాలన్నీ తీసుకున్నాక రానని చెప్పాడు.  ఎంత డబ్బయినా ఇస్తానని వసంత వాహాన యాజమానికి  ఆశ చూపించింది. దీంతో  అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వసంత ఇంటికి  చేరుకున్న  పోలీసులు  మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వసంత,  దివ్యది సహజ మరణంగా చూపడానికి ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు  హత్య కోణంలో దర్యాప్తు చేశారు. పోలీసు జాగిలాలు వసంత , ఆమె సోదరి చుట్టూ తిరగటంతో పోలీసులు వసంతను, ఆమె సోదరి మంజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  పోలీసు విచారణలో  వసంత హత్యా నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వసంత సోదరి, మరిదిని అదుపులోకి తీసుకున్నారు.  

కాగా…..దివ్య కుటుంబ సభ్యులు 2015 లో హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు అమ్ముమ్మలను  కూడా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ హత్యలపైనా  కూడా పోలీసులు విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.