E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార

E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Ration Cards Ekyc

Ration Cards EKYC : ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచారం జరుగుతుండటంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ-కేవైసీ కోసం మీ-సేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది.

రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని.. ఇందుకు ఎలాంటి గడువు లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ఈ కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం అంది. ఈ కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకోవచ్చంది. వాలంటీర్ల ద్వారా ఈ-కేవైసీ చేయించుకునే సదుపాయాన్ని కల్పించామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ఆధార్, మీ-సేవ కేంద్రాల దగ్గరికి వెళ్లడం తగ్గించాలని ప్రభుత్వం కోరింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈ-కేవైసీ నమోదు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 10శాతం మంది ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమమని కోన శశిధర్ స్పష్టం చేశారు. అయితే ప్రతీ ఒక్కరూ ఆధార్ డేటాతో ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు.

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ రేషన్ పథకంలో భాగంగా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించింది. కోవిడ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం అక్కడ రేషన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ కేవైసీకి ప్రాధాన్యం పెరిగింది. అన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రాల్లోని లబ్ది దారులకు ఈ కేవైసీ చేయించాలని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్రాలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి.

ఏపీలో రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సిందే. లేదంటే రాబోయే రోజుల్లో వారికి రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసరాలు అందే వీలుండదు. ఒక రేషన్‌ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుంటే.. ఎంతమంది ఈ కేవైసీ చేయించుకుంటే వారికే బియ్యం అందుతాయి. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో 85శాతం మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. అందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే కేంద్రం ఆదేశాలతో.. పౌర సరఫరాలశాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. పెద్దలు ఆగస్టు నెలాఖరులోగా, పిల్లలకైతే సెప్టెంబరు నెలాఖరులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావాలని గతంలో అధికారులు చెప్పారు . కార్డుల్లో పేర్లున్న ఐదేళ్లు లోపు పిల్లలకూ కొత్తగా నమోదు చేయించి.. ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తోంది.

రేషన్ కార్డులో ఎవరికి ఈ-కేవైసీ కాలేదో.. వారికి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. ఇందులో పేరున్న వారంతా నెలాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆధార్‌ వేలిముద్రలు పడని వారు మీ-సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అనేక చోట్ల బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల జనాలకు ఈ కేవైసీ కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచి జనాలు పోస్టాఫీస్, మీ-సేవా సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు.