జూన్-19న రాజ్యసభ ఎన్నికలు…ఏపీలో 4సీట్లకు 5అభ్యర్థులు

  • Published By: venkaiahnaidu ,Published On : June 1, 2020 / 01:10 PM IST
జూన్-19న రాజ్యసభ ఎన్నికలు…ఏపీలో 4సీట్లకు 5అభ్యర్థులు

కోవిడ్-19 నేపథ్యంలో విధించబడిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ(జూన్-1,2020) కొత్త తేదీలను ప్రకటించింది. మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు  జూన్-19న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీ నుంచి 4, గుజరాత్ నుంచి 4, రాజస్థాన్ నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 3, ఝార్ఖండ్ నుంచి 2, మణిపూర్ నుంచి 1, మేఘాలయ నుంచి 1 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ తరపున రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. 4 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు పోటీచేస్తున్నారు. టీడీపీ తమ అభ్యర్థిని దించకుంటే ఏపీలోనూ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేవి

ఈ ఏడాది ఫిబ్రవరి-25న దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోఖాళీ అయిన 55 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మార్చిలో 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు అవసరం లేకుండా ఏగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పటికే కరోనా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఎన్నికలు ఆగిపోయాయి. ఆయా స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తాజగా ప్రకటించింది.