హనుమంతుని జన్మస్థలం నిర్ధారణకు TTD కమిటీ ఏర్పాటు

హనుమంతుని జన్మస్థలం నిర్ధారణకు TTD కమిటీ ఏర్పాటు

Tirumala Hanuman

birthplace of Hanuman : టెన్ టీవి వరుస కథనాలతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది. అంజనాద్రి పర్వతంపై గల జాపాలి క్షేత్రం హనుమంతుని జన్మ స్థలంగా 10టీవీ పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన టీటీడీ జన్మస్థల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు చేసింది. హనుమంతుని జన్మస్థలం నిర్ధారణకు టీటీడి ఈవో జవహర్ రెడ్డి పండితులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా సంస్కృత విశ్వవిద్యాల‌యం వీసీ ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం వీసీ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శన శ‌ర్మ, ‌ సంస్కృత విశ్వవిద్యాల‌యం ప్రొఫెసర్లు జె.రామ‌క్రిష్ణ, శంక‌ర‌నారాయ‌ణ‌, ఎస్వీ వేద ఆధ్యయ‌న సంస్థ ప్రత్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మలను నియమించింది.

టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో జవహర్ రెడ్డి పండితులతో 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సమావేశమయ్యారు. తిరుమల కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమన్న అంశంపై పరిశోధన జరిపి, ఆధారాలు సిద్ధం చేయాలని పండితులను కోరారు. స్కంధ, వ‌రాహ, ప‌ద్మ, బ్రహ్మాండ, భ‌విష్యోత్తర పురాణాలను, వెంక‌టాచ‌ల మ‌హా‌త్యంను అధ్యయనం చేసి వివరాలు సిద్ధం చేయాలని సూచించారు. అంజనాద్రి హనుమంతుని జన్మ స్థలంగా తేలితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని జవహర్‌రెడ్డి వెల్లడించారు.

హనుమంతుని జన్మస్థలంపై గతంలోనే 10 టీవీ పలు ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది.. తిరుమల గిరుల్లోనే.. ఆంజనేయుడు జన్మించాడని.. ఈ ప్రాంతాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని భక్తులు, కొందరు చరిత్రకారుల నుంచి విమర్శలు రావడంతో ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది.. విమర్శలు, 10 టీవీ కథనాలతో స్పందించిన టీటీడీ ఇప్పుడు రామ భక్తుడి జన్మస్థలంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తిరుమలలో జాపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతున్నారు కొందరు. ఇదే విషయమై.. శ్రీ హనుమ జన్మస్థలం-అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్ జీ హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికమైందని.. స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా తన పుస్తకంలో తెలిపారు. హనుమంతుడు పుట్టిన స్థలంపై వివాదం ఈనాటిది కాదు.

మారుతి జన్మస్థలిగా.. దేశంలో చాలా ప్రదేశాలు.. పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అంజనీదేవి.. బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ.. వివిధ ఆలయాల్లో నిత్యం పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. అలా.. ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర తిరుమల క్షేత్రంలోని జాపాలి తీర్థం కూడా ఒకటి. పవనసుతుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల ఏడుకొండల్లో ఒకటైన.. అంజనాద్రిపై వెలిసిన జాపాలి దగ్గర హనుమంతుడు పుట్టినట్లు కొన్ని స్థల పురాణాల్లో ఉంది. అంజనీదేవి.. ఆంజనేయుడికి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే.. ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కిందని ఇతిహాసం. ఇక్కడి అటవీ ప్రాంతంలో పురాతన ఆంజనేయ ఆలయం ఉంది. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. జాపాలిలో హనుమంతుడి దర్శనం చేసుకుంటారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది 10 టీవీ.. భక్తుల అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచింది.. దీంతో ఈ విషయాలపై తీవ్రమైన చర్చ జరిగింది.