ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ మద్దతుదారుల హవా

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ మద్దతుదారుల హవా

first phase panchayat elections in AP : ఏపీలో పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్రభావం చూపలేదు.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ మద్దతుదారులు మొదటిసారి బోణీ కొట్టారు. రాత్రి వరకు చాలా స్థానాల్లో లెక్కింపు కొనసాగింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప.. కౌంటింగ్‌ ప్రశాంతంగానే సాగింది. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో.. మెజార్టీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు. ఫస్ట్‌ ఫేజ్‌ ఫలితాలు రావడంతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద సెలబ్రేషన్స్‌ భారీఎత్తున జరిగాయి. మొత్తం సీట్లలో 90 శాతానికి పైగా గెలిచామంటున్నాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ ఆఫీస్‌ వద్ద బాణసంచా, బ్యాండ్‌బాజాతో సందడి చేశాయి.

వైసీపీ నేతలు మాత్రమే కాక.. తమ పార్టీ మద్దతుదారులు కూడా చాలా చోట్ల విజయం సాధించారని టీడీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకున్నారు. పార్టీలవారిగా ఎలా ఉన్నా.. తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన అభ్యర్థులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు.