ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 04:45 PM IST
ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

sp balu bharat ratna.. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. భారతరత్నకు ఎస్పీ బాలు అర్హుడు అని, ఆయనకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిందేనని అభిమానులు అంటున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ, క్రీడా అనే తేడా లేకుండా అబాల గోపాలం నివాళులు అర్పించారు. అంతటి మహాగాయకుడికి ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఎస్పీ బాలు.. 50 ఏళ్లు భారతీయ సినీ సంగీతాన్ని తన గళంతో శాసించారు. ఆయన గురించి ఎంత చెప్పినా.. సముద్రంలో నీటి చుక్కంత. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు బాలు. ఆయన మధుర స్వరం వినకుండా సంగీత ప్రియులకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి బాలు తన రెండు కోరికలు తీరకుండానే కన్నుమూశారు.

సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేసినా.. ఎస్పీ బాలుకు దర్శకత్వం వహించాలనేది ఓ కోరిక. పలు సందర్భాల్లో ఆయన మిత్రులు కూడా బాలు గారిని ఏదైని సినిమాకు డైరెక్ట్ చేయమని కోరారట. ఆయన కూడా ఓ కథను కూడా రెడీ చేసుకున్నట్టు సమాచారం. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచారు. భారతీయ సినీ సంగీత ప్రేమికులు ఎంతగానో అభిమానించే ఎస్పీ బాలు.. ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

దాపరికం లేకుండా మాట్లాడే ఎస్పీబీ.. ఇటీవల దాదాపు ప్రతి సందర్భంలోనూ తన చివరి కోరికను బయటపెట్టారు. చనిపోయే చివరి నిమిషం దాకా పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే కన్నుమూయాలని కోరుకుంటున్నానని ఎస్పీబీ అన్నారు. కానీ చివరికి ఆయన కోరుకున్నట్లు కాకుండా.. దాదాపు 50 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ, అనారోగ్యం తిరగబెట్టడంతో కన్నుమూయడం విచారకరం.

సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త యావత్‌ సంగీత ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. మరీ ముఖ్యంగా బాలు అభిమానులు, శ్రేయోభిలాషులకు తీరని వేదన మిగిల్చింది. కరోనాను జయించిన ఆయన ఇతర అనారోగ్య సమస్యలతో శుక్రవారం(సెప్టెంబరు 25,2020) కన్నుమూశారు. గాయకుడిగానే కాదు డబ్బింగ్‌ కళాకారుడిగా, నటుడిగా వెండితెర ముందూ వెనుక తనదైన ముద్రవేశారు బాలు. గాయకుడిగా బిజీగా ఉన్న సమయంలోనూ చక్కని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

నాలుగు దశాబ్దాల కెరీర్.. 16 భాషల్లో 41వేల 230 పాటలు.. గాయకుడిగానేకాదు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ అందెవేసిన చేయి.. వెళ్లిన ప్రతిచోటా మనస్ఫూర్తిగా ఆదరించి అభిమానించిన ప్రజలు.. పాటలపై మక్కువతో తన కొడుక్కి చరణ్ అని, కూతురికి పల్లవి అని పేర్లు పెట్టుకున్నారు.. వయసు పైబడినా.. యువతరంతో పోటీ పడుతూ రికార్డింగ్స్ చేసేవారు.. కరోనా బారిన పడేంత వరకూ ఆయన గొంతు పలుకుతూనే ఉండింది. ఎంతటి కష్టతరమైన స్వరాలను కూడా అవలీలగా పలికిచడం ఎస్పీ బాలుకే చెల్లింది. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.