Heavy Rains In Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు.

Kadapa Rains
Heavy rains, floods in Kadapa : ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో నెల్లూరు, కడప అతలాకుతలమవుతున్నాయి. కడప జిల్లాలో మైలవరం, గండికోట, బుగ్గవంక ప్రాజెక్టులు ఎప్పుడూ లేనంతగా జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో చెరువులు, కుంటలు ప్రమాదపుటంచున ఉన్నాయి.
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కడప జిల్లాకు మరో వాయుగుండం పొంచి ఉంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 1 వేయి 450 చెరువుల్లో 40 చెరువులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 40 చెరువుల కింద అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తక్షణమే ఈ చెరువుల కింద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే అలుగు కట్టలను తెంపారు.
Heavy Rains : ఏపీని వెంటాడుతున్న వానగండం..రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత
జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత పదిరోజుల క్రితం కురిసిన వర్షాలను మరవక ముందే మళ్లీ విరుచుకుపడుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాపాగ్ని, కుందు, చెయ్యేరు, బహుదా, గుంజన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. గండికోట , మైలవరం, బుగ్గవంక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలలో వాగులు వంకలు దాటే పరిస్థితి అధికంగా ఉంది. దీంతో వాటిని ప్రజలు దాటకుండా చూసేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.
కడప నగర సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టులోకి ఇన్ ప్లో పెరగడంతో.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. బుగ్గవంక పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా మైలవరం డ్యామ్, బుగ్గవంక డ్యామ్‌లకు ప్రమాదం వాటిల్లకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అన్నమయ్య డ్యామ్ ఘటన పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతోంది. 24 గంటల పాటు ప్రాజెక్టులు, నదులు, చెరువులు వద్ద నిఘా ఉంచారు. వర్షాలతో మళ్లీ ఎలాంటి మరణాలు సంభవించకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపట్టారు.