10Tv Exclusive: నాకేం తెలియదు.. రంగయ్య ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకాను హత్యచేసింది ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి అని వాచ్‌మెన్‌ రంగయ్య చెప్పడంతో కేసు మలుపు తిరిగింది.

10Tv Exclusive: నాకేం తెలియదు.. రంగయ్య ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలు

Erra Gangireddy

Erra Gangi Reddy: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకాను హత్యచేసింది ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి అని వాచ్‌మెన్‌ రంగయ్య చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. వివేకా కేసులో రంగయ్య కామెంట్స్‌తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివేకాను చంపింది వీళ్లే అంటూ ముగ్గురి పేర్లు చెప్పడంతో.. రంగయ్య ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కేసు విచారణకు సంబంధించి ఎవరితో మాట్లాడవద్దంటూ రంగయ్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

రంగయ్య చెప్పిన అంశాలపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి ప్రమేయంపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వాచ్‌మెన్ రంగయ్య ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఆ ముగ్గురేనా…? వాచ్‌మెన్‌ రంగయ్య ఆరోపణల వెనకున్న వాస్తవమెంత..? వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎర్ర గంగిరెడ్డి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? ఇదే విషయంపై ఇప్పుడు సీబీఐ అధికారులు దృష్టిపెట్టారు.

మాజీ డ్రైవర్‌ దస్తగిరి, మరో అనుచరుడు సునీల్ ఈ హత్యలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే వివేకాతో సన్నిహితంగా ఉండే అనుచరులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే రంగయ్య చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా ఎర్రగంగిరెడ్డి స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వాచ్‌మెన్ రంగయ్య చేసిన ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి 10Tvతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని చెప్పారు. అసలు రంగయ్యతో తనకు పరిచయమే లేదన్నారు గంగిరెడ్డి. వాచ్‌మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదని అన్నారు. నేను ఎవరిని బెదిరించలేదంటూ చెప్పుకొచ్చారు.

కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు ఎక్కడ లేవని, రంగయ్యను బెదిరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. వివేకాకు నేను ద్రోహం చేసే వ్యక్తిని కాదని, వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. వివేకానంద రెడ్డి నన్ను బాగా చూసుకొనే వారని, ఆయన హత్య విషయంలో నాకు ఏమీ తెలియదన్నారు. ఒక్కసారి మాత్రమే రంగయ్యను వివేకా ఇంటి దగ్గర రంగయ్యను చూశానని అన్నారు ఎర్ర గంగిరెడ్డి.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి 11గంటల 20నిమిషాలకి ఇంటికి వచ్చానని, ఉదయం ఏడు గంటలకు వివేకానంద రెడ్డి అల్లుడు ఫోన్ చేసి చెప్తేగాని, నాకు విషయం తెలియలేదని అన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసినవారు కానీ, చేయించినవారు కానీ నాకు తెలియదని, తనకు నార్కో అనాలసిస్ పరీక్షలు సైతం నిర్వహించినట్లు ఎర్ర గంగిరెడ్డి వెల్లడించారు.