మేం చనిపోయామట: కాగితాల్లో చంపేసి స్థలం కబ్జా చేశారు

  • Published By: vamsi ,Published On : October 31, 2020 / 11:27 AM IST
మేం చనిపోయామట: కాగితాల్లో చంపేసి స్థలం కబ్జా చేశారు

సినిమాల్లో చూస్తుంటాం.. స్థలాలను కబ్జా చేసేందుకు విలన్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి అసలు ఓనర్లను చంపేసినట్లుగా చూపించడం.. సరిగ్గా అటువంటి ఘటనే రియల్ లైఫ్‌లో కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు ఇటువంటివి వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో కూడా ఓ దంపతులకు చెందిన 300 గజాల స్థలాన్ని అక్రమార్కులు నొక్కేసేందుకు సిద్ధం అయ్యారు.



బాధితులు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖలోని కంచరపాలెంకు చెందిన కె.అప్పారావు, సుశీల అనే దంపతులు నరవ గ్రామంలో సర్వే నంబర్ 248లోని 300 గజాల స్థలాన్ని 1984లో కొనుక్కున్నారు. ఆ స్థలం ఖాళీగా ఉండడం.. అప్పారావు కుటుంబం ఆ ప్రాంతానికి దూరంగా ఉండడంతో విశాలాక్షినగర్‌కు చెందిన సోదరులు జి.తిరుపతిరావు, వెంకటరమణయ్య అనే ఇద్దరు స్థలం కాజేయాలని కుట్ర చేశారు.



https://10tv.in/police-solves-visakhapatnam-atm-loot-case/
అనుకున్నదే తడవుగా.. దంపతులు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్‌లను తయారు చేసి స్టాంప్ పేపర్లపై సంతకాలను ఫోర్జరీ చేసి 300 గజాల స్థలాన్ని నొక్కేశారు. అప్పారావు, సుశీలతో వారికెలాంటి సంబంధం లేనప్పటికీ సుశీల సోదరి అవుతుందంటూ రిజిష్టర్‌ కాని వీలునామాను సృష్టించి డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రస్తుతం బతికున్న అప్పారావు 1998 జులై15న, సుశీల 2001 మే2న చనిపోయినట్లు అప్పటి తేదీలతో శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సర్టిఫికేట్లను కూడా క్రియేట్ చేయించారు.



రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌కు ఒరిజినల్‌ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ ఒరిజనల్‌ డాక్యుమెంటు పోయిందంటూ ఓ పత్రికలో ప్రకటన ఇచ్చి కోర్టు నుంచి అఫిడవిట్‌ తీసుకున్నారు. ఫోర్జరీ సంతకాలు, అవసరమైన నకిలీ పత్రాలతో నమ్మించి ఈ ఏడాది జనవరిలో పెదగంట్యాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు.



అయితే అసలు విషయం బయటకు ఎలా ఎప్పుడు వచ్చిందంటే? నరవ పరిసరాల్లో గజం విలువ పది వేలు రూపాయల వరకు పలుకుతుంది. కానీ మోసానికి సిద్ధమైన అక్రమార్కులు.. రూ.5వేలకు స్థలాన్ని అమ్మేందుకు సిద్ధమై స్థానికులను సంప్రదించారు. దీంతో విషయం అప్పారావు దంపతులకు తెలియడంతో రెండు వారాల క్రితం వారు పోలీస్‌ కమిషనర్‌ను కలిశారు. కేసును ఆయన పెందుర్తి పోలీసులకు అప్పగించారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎస్‌ఆర్‌వో చక్రపాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. వారి నుంచి అన్ని ఆధారాలు స్వీకరించి డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌కు పంపినట్లు ఎస్‌ఆర్‌వో చక్రపాణి వెల్లడించారు.