ISRO – PSLV-C52: మూడు ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52

మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది.

ISRO – PSLV-C52: మూడు ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52

Isro

ISRO – PSLV-C52: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ లాంచ్ విజయవంతం అయింది. ఆర్ఐశాట్1, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్ అనే మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52.. నిర్ణిత సమయానికి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆదివారం తెల్లవారు జామున 4.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్.. 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగి.. సోమవారం తెల్లవారు జామున విజయవంతంగా ముగిసింది.

Also read: Free Fire : ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు షాక్.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు

మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలు:
ఆర్ఐశాట్1: 1710 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం సేకరించనున్నారు. ఇమేజ్ డేటా ఆధారంగా పనిచేసే ఈ ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. ఆర్ఐశాట్ (ఈవోఎస్ -04)గా పిలిచే ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించనుంది.

ఐఎన్ఎస్-2టీడీ: 17.50 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించారు. భవిష్యత్తు సైన్స్ అవసరాలు, పేలోడ్స్ ప్రయోగాల నిమిత్తం ఈ ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆరు నెలల పాటు ఈ ఉపగ్రహ సేవలను వినియోగించుకోనున్నారు.

Also read: Anna Hazare: ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్న అన్నా హజారే

ఇన్స్పైర్ శాట్ 1: 8.10 కిలోల అతి తక్కువ బరువుగల ఈ “ఇన్స్పైర్ శాట్ 1” ఉపగ్రహాన్ని దేశంలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు సంయుక్తంగా రూపొందించారు. కాంపాక్ట్ అయనోస్పియర్ ప్రోబ్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ “ఇన్స్పైర్ శాట్ 1”.. భూమిపై అయనోస్పియర్ ను అధ్యయనం చేయనుంది. ఏడాది పాటు ఈ ఉపగ్రహ సేవలు వినియోగించుకోనున్నారు.

కాగా, ఇస్రో నూతన చైర్మన్ సోమనాథన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇది. అనుకున్న సమయానికే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ సోమనాథన్ సంతోషం వ్యక్తం చేశారు. సహచరులకు, శాస్త్రవేత్తలకు, ఇస్రో సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల కృషిని సోమనాథన్ ప్రశంసించారు.

Also read: Police System: పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 26,275 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం