Police System: పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 26,275 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం

దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న పోలీసు, అనుబంధ వ్యవస్థలను ఆధునికీకరించే(ఎంపిఎఫ్ ) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Police System: పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 26,275 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం

Police

Police System: దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న పోలీసు, అనుబంధ వ్యవస్థలను ఆధునికీకరించే(ఎంపిఎఫ్ ) పథకాన్ని కొనసాగించడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. ఈ పథకం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో అమలుకానుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు బలగాల ఆధునీకరణ మరియు పనితీరును మెరుగు పరచాలన్న లక్ష్యంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పథకానికి రూపకల్పన చేశారు. పధకాన్ని అమలు చేసేందుకు అవసరమైన రూ.26,275 కోట్లను కేంద్ర నిధుల నుంచి సమకూర్చనున్నారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి వాటి సామర్థ్యం పెంపొందించేందుకు అవసరమైన అన్ని సంబంధిత ఉప పథకాలను దీనిలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.

Also read: Srilanka: “వీసా ఆన్ ఎరైవల్”ను పునఃప్రారంభించిన శ్రీలంక, పాకిస్తాన్ కి మాత్రం లేదు

ఈ ఎంపిఎఫ్ పథకం ముఖ్య అంశాలు:
1. దేశంలో పటిష్టమైన ఫోరెన్సిక్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పథకంలో చర్యలు అమలవుతాయి. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, మాదకద్రవ్యాల నియంత్రణలో రాష్ట్రాలకు తగిన సహకారం అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

2.కేంద్ర ప్రభుత్వం అందించే మొత్తం నిధులలో రూ.4,846 కోట్లు రాష్ట్ర పోలీసు బలగాల ఆధునీకికరణ జరగనుంది.

3. ఆధునిక పద్ధతుల్లో శాస్త్రీయ మరియు సమయానుకూల పరిశోధనకు దోహదపడే విధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో స్వతంత్ర కార్యాచరణతో ఫోరెన్సిక్ సైన్సెస్ సౌకర్యాలు అభివృద్ధి చేయనున్నారు. ఫోరెన్సిక్ సౌకర్యాల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,080.50 కోట్లను కేటాయించింది.

4. కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన జమ్మూకాశ్మీర్, తిరుగుబాటు ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత అంశాల కోసమే రూ.18,839 కోట్లను కేటాయించనున్నారు.

Also read: IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్

5. వామపక్ష తీవ్రవాద సమస్యలను నివారించేందుకు కేంద్రం తెచ్చిన “జాతీయ విధానం, కార్యాచరణ కార్యక్రమం” ద్వారా దేశంలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం కొనసాగించనున్నారు. అందుకోసం రూ.8,689 కోట్లను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర నిధులతో వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కారానికి ఆరు సంబంధిత పథకాలు ఆమోదించబడ్డాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్ర సహాయంగా అందించే నిధులతో అమలయ్యే పథకాలు దీనిలో భాగంగా ఉంటాయి.

6. ఇండియా రిజర్వ్ బెటాలియన్లు/స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్లను నెలకొల్పేందుకు రూ.350 కోట్లను ఈ పధకంలో భాగంగా అందించనున్నారు.

7. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రూ.50 కోట్లను కేటాయించారు. ఇప్పటికే అమలులో ఉన్న ఈపథకానికి ఈ నిధులు అదనం కానున్నాయి.

Also read: Assembly Elections: ఉత్తరప్రదేశ్ రెండో దశ, గోవాలో మొదటి విడత పోలింగ్‌కి సర్వం సిద్ధం