Nadendla Manohar: డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు

Nadendla Manohar: డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్

Manohar

Updated On : March 21, 2022 / 2:53 PM IST

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించని ఇళ్లకు మునిసిపల్ అధికారులు తాళాలు వేసిన ఘటనపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమావారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బుల కోసం రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంట్లో మహిళలు ఉండగా ఇంటికి సీలు వేసి పన్ను కట్టాలని హెచ్చరిస్తారా? జగన్ రెడ్డి గారు అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు” అంటూ మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Also Read: TRSLP Meeting : బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు దిశా, నిర్దేశం

ఇళ్లకు తాళాలు వేయడం..కుళాయిలకు బిరడాలు కొట్టడం..దుకాణాల ముందు చెత్త పోయడం..వంటి ఘటనలన్నీ పాలకుల వికృత మనస్తత్వానికి అద్దంపడుతున్నాయని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను పీడించి..వేధించి ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజంతో జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి వరకూ ఓటీఎస్ పేరుతో పేదల ముక్కుపిండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల వసూలు విధానంలో పాలకులు ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Also Read: Nellore : ప్రేమించడం లేదని యువతి గొంతు కోశాడు.. నిందితుడిని పట్టుకున్నామన్న ఎస్పీ

“సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా..ప్రజలు మా దగ్గరపడిఉండాల్సిందే” అన్న నియంతృత్వ ధోరణే వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోందన్న మనోహర్.. ఇదేనా జగన్ గారు చెబుతున్న సంక్షేమ పాలన అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ప్రజల గౌరవాన్ని కించపరచలేదని, ప్రభుత్వం చేసే చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Also Read: MInister Anil Kumar: దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి.. – అనిల్ కుమార్