JanaSena: టీడీపీతో పొత్తు.. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ?

టీడీపీతో పొత్తుపై ఎవరూ వ్యతిరేకంగా లేకపోయినా.. తాము కోరినన్ని సీట్లు ఇస్తారా? అడిగిన నియోజకవర్గాలు కేటాయిస్తారా? అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది.

JanaSena: టీడీపీతో పొత్తు.. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ?

Janasena Party how many seats ask TDP

JanaSena- TDP Alliance: రాష్ట్రంలో పొత్తులు ఖరారైపోయాయి. ఎవరు ఎవరితోనో తేలిపోయింది.. పెద్దగా ప్రభావం చూపలేని జాతీయపార్టీలను పక్కనపెడితే.. ప్రజల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల లెక్క తేలింది. టీడీపీ-జనసేన పొత్తు (TDP Janasena Alliance) ప్రకటనతో రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఇక సీట్ల సర్దుబాటే మిగిలింది. ఐతే ఈ కీలక పరిణామానికి కారణమైన జనసేనలో సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా భారీ చర్చ మొదలైంది. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడగాలి? ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు పవన్.. ఈ సమావేశమే ఏపీ రాజకీయ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తోంది.

టీడీపీతో పొత్తు ఖాయం చేస్తూ జనసేనాని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేస్తోంది. ఇటు బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసిపోటీ చేస్తామని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీతో కలిసిపోటీ చేస్తామని జనసేనాని ఎప్పటి నుంచో చెబుతున్నా.. ఇన్నాళ్లు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. పార్టీలో చర్చించాకే పొత్తుల ప్రకటన ఉంటుందని.. పార్టీలో చర్చించే సమయంలో పొత్తులపై ఎలాంటి వైఖరి తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చని జనసేన నాయకులు భావించారు. కానీ, జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం అనుకోకుండా పొత్తు ప్రకటన చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టింది జనసేన. రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడంపై క్లారిటీ రావడంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై ఇకపై ఫోకస్ పెట్టాల్సివుంది.

వాస్తవానికి ఇంతవరకు జనసేనలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సొంత నియోజకవర్గం తెనాలిపై ఉన్నంత స్పష్టత మరే నియోజకవర్గంపైనా లేదు. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఇంతవరకు చెప్పలేదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్.. మళ్లీ ఆ రెండు చోట్లా పోటీ చేస్తారా? లేక మరో కొత్త నియోజకవర్గానికి మారతారో క్లారిటీ లేదు. పవన్ ఒక్కరే కాదు.. చాలా చోట్ల ఇలాంటి గందరగోళమే ఉంది. పార్టీలో మరో కీలక నేత.. నాగబాబు గత ఎన్నికల్లో నరసాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. మళ్లీ ఆయన లోక్‌సభకే పోటీ చేస్తారా? లేక అసెంబ్లీని ఎంచుకుంటారా? అన్నది సస్పెన్స్‌గానే ఉంది.

Also Read: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ధర్నా.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

టీడీపీతో పొత్తుపై ఎవరూ వ్యతిరేకంగా లేకపోయినా.. తాము కోరినన్ని సీట్లు ఇస్తారా? అడిగిన నియోజకవర్గాలు కేటాయిస్తారా? అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ముందుగా స్పష్టత రావాల్సివుంది. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ విషయమై ఎలాంటి ప్రకటనైనా చేస్తారా? అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రబాబుతో పవన్ ఏం చర్చించారు? ఎలా ముందుకు వెళతారు అన్నదానిపై క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్నారు కార్యకర్తలు.

Also Read: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

మరోవైపు జనసేన విస్తృతస్థాయి సమావేశంపై ఏపీలోని మిగిలిన పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయాలని అధికార పార్టీ కోరుకుంటే.. జనసేన కలిసిరావాలని కోరుకుంది టీడీపీ.. ఇప్పుడు జనసేన క్లారిటీ ఇవ్వడంతో సీట్ల సర్దుబాటుపై ఆసక్తి పెరుగుతోంది. మొత్తానికి జనసేనాని ఒక్క ప్రకటన ఏపీలో హీట్ పెంచేయగా.. విస్తృతస్థాయి సమావేశం హైటెన్షన్‌కు గురిచేస్తోంది.