Vizag Steel Plant: ఈవోఐకు అనూహ్య స్పందన.. భిన్నమైన ప్రతిపాదనతో బిడ్డింగ్‌లో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ

భిన్నమైన ప్రతిపాదనతో స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్, ముడి సరుకు సమీకరణ బిడ్డింగ్‌లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కీలక విషయాలు చెప్పారు.

Vizag Steel Plant: ఈవోఐకు అనూహ్య స్పందన.. భిన్నమైన ప్రతిపాదనతో బిడ్డింగ్‌లో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ

Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (EOI-Expression of Interest)కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు మొదట నిధులు ఇచ్చి.. అనంతరం నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ ప్రతిపాదనల బిడ్డింగులో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుండడంతో దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. చివరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర సర్కారు కూడా స్పష్టం చేసింది. దీంతో 22 సంస్థలు బిడ్డింగులు వేశాయి. ఓ ప్రైవేటు సంస్థ తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ వేశారు. భిన్నమైన ప్రతిపాదనతో స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్, ముడి సరుకు సమీకరణ బిడ్డింగ్‌లో పాల్గొన్నారు.

క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూల ధనాన్ని సమీకరిస్తామని చెప్పారు. 8 కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో 100 రూపాయలు ఇచ్చినా 800 కోట్ల రూపాయలు అవుతుందని తెలిపారు. అలాగే ముడి సరుకు సేకరించి ఇస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు కావాల్సింది నిధులు, ముడి సరుకు మాత్రమేనని తెలిపారు.

అవి ఎక్కడ నుంచి ఎలా వచ్చాయన్నది అనవసరమని చెప్పారు. 4 నెలల సమయంలో క్రౌడ్ ఫండింగ్ చేస్తామని జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. నాలుగు నెలల పాటు ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే 3,200 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పారు. కాగా, బిడ్డింగ్ లో తెలంగాణ సర్కారు పాల్గొనడంపై అధికారులు ఇప్పటికీ నిర్ధారించలేదు.

EOI గడువు మరో 5 రోజులు పెంపు
స్టీల్ ఫ్లాంట్ EOI గడువును మరో 5 రోజులు పెంచుతూ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 20వ తేదీ మధాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఇప్పటికే 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని కంపెనీలు ఇందులో పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంచారు.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కు ఎవరు అర్హులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..