Kandukur Stampede : కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటన.. టీడీపీ నేతలను విచారించిన కమిషన్

కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. కందుకూరు టీడీపీ నేతలు ఇంటూరి రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావులను విజయవాడలో విచారించింది.

Kandukur Stampede : కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటన.. టీడీపీ నేతలను విచారించిన కమిషన్

Kandukur Stampede : కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. కందుకూరు టీడీపీ నేతలు ఇంటూరి రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావులను విజయవాడలో విచారించింది. కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం టీడీపీ నేతలను ప్రశ్నలు అడిగింది. అయితే, తమ దగ్గర సమాచారం లేదని తెలిపిన టీడీపీ నేతలు, కమిషన్ సేకరించిన వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో తమ దగ్గరున్న వివరాలు అందించేందుకు జస్టిస్ శేష శాయినా రెడ్డి అంగీకరించారు. ఈ నెల 15న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఈ విచారణ జరిగింది. విచారణ అనంతరం నివేదికను జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుంది. టీడీపీ నేతలను రెండున్నర గంటల పాటు విచారించారు జస్టిస్ శేష శాయినా రెడ్డి.

Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సభల సమయంలో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. దీనిపై కమిషన్ విచారణ చేపట్టింది. కందుకూరు ఘటనపై టీడీపీ నేతలు కాకర్ల మల్లికార్జున్, ఇంటూరి రాజేష్‌.. గుంటూరు ఘటనపై తెనాలి శ్రావణ్ కుమార్.. శేష శాయినా రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. కాగా నిన్న గుంటూరు ఘటనపై ఉయ్యూరు శ్రీనివాసరావుని శేష శాయినా రెడ్డి కమిషన్ విచారించింది. విచారణ అనంతరం నివేదికను జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ ప్రభుత్వానికి అందజేయనుంది.

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన ‘ఇదేం కర్మ’ సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు ముందుకు రావడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కింద పడిపోయారు. కొందరు పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయారు. వారిని పైకి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే శ్వాస అందక ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. ఆసుపత్రిలో మరో ఆరుగురు చనిపోయారు.

Also Read..AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..

గుంటూరు ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత సభా ప్రాంగణం వెలుపల లారీల్లో ఉంచిన కానుకలను పంచుతుండగా.. ఒకేసారి అందరూ ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయి. నిర్వాహకుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణంగా తేల్చారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.