Annamayya Project : అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది? జలప్రళయం నుంచి ఎలా రక్షించారు? సీఎంకు కలెక్టర్ వివరణ

ఏపీలో భారీవర్షాలు ముంచెత్తాయి. ఈ అతివర్షాల ప్రభావంతో కడప జిల్లా అతులాకుతలమైంది.. ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెకట్టు ఆనకట్టు ఒక్కసారిగా తెగిపోయింది.

Annamayya Project : అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది? జలప్రళయం నుంచి ఎలా రక్షించారు? సీఎంకు కలెక్టర్ వివరణ

Kadapa Collector To Describe How Tackle Floods After Breach Annamayya Project

Annamayya Project Breach : ఏపీలో భారీవర్షాలు ముంచెత్తాయి. ఈ అతివర్షాల ప్రభావంతో కడప జిల్లా అతులాకుతలమైంది.. ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెకట్టు ఆనకట్టు ఒక్కసారిగా తెగిపోయింది. అసలు ఆనకట్ట ఎందుకు తెగింది? జలప్రళయం నుంచి అక్కడి ప్రజలను ఎలా రక్షించారు వంటి పూర్తి వివరాలను కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు సీఎం జగన్ వివరించారు. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల్లో వరద, అనంతరం తీసుకున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎంకు ఆయన సమగ్రంగా వివరించారు. కడప జిల్లాల్లో భారీవర్షాలు, వరదలకు దారితీసిన పరిస్థితులు చాలా అనూహ్యమైనవిగా పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఏకకాలంలో అతిభారీ వర్షాలు కురిశాయన్నారు. జిల్లాలో ఒక ప్రాంతంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో అతి తక్కువ సమయంలో భారీవర్షం నమోదైందని తెలిపారు. నవంబర్ 18, గురువారం ఉదయం 8.30 గంటలకు ఫించ ప్రాజెక్టు ఇన్ ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమేనన్నారు. కానీ, అదే రోజు సాయంత్రం 6గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో ఇన్ ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు చేరిందని చెప్పారు.

గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకూ కడప జిల్లాల్లోని మొత్తం 50 మండలాల్లో కూడా సగటున 10.7 పెం.మీ వర్షపాతం కురిసింది. దీనికితోడు తిరుపతి సహా చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున భారీ వర్షాలు కురిశాయి. దాంతో అక్కడి వరదనీరు అంతా చెయ్యేరు పరీవాహక ప్రాంతానికి చేరుకుంది. మరోవైపు పీలేరులో, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలో జరిగింది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటలకు భారీగా నీరు వచ్చి చేరింది. చెయ్యేరు నదిపై మొదట పింఛా ప్రాజెక్టు, దానికింద అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. పింఛా డ్యాం విడుదల సామర్థ్యం కేవలం 48వేల క్యూసెక్కులు మాత్రమే.. నవంబర్‌ 18వ తేదీ, గురువారం సాయంత్రం పింఛాకు 50వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కూడా ఉంది. 18వ తేదీ అర్థకాత్రి పింఛా ప్రాజెక్టులో 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరందన్నారు. దీని విడుదల సామర్థ్యం కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ వరద నీరు వచ్చిందన్నారు. రింగ్‌బండ్‌ను ప్రొటెక్ట్‌చేసినా.. ఈ నీటిని అడ్డుకోలేనిపరిస్థితి ఏర్పడిందని కలెక్టర్ విజయరామరాజు వివరించారు.

50ఏళ్ల తర్వాత ఇంత నీరు ఎప్పుడూ రాలేదు :
అదే రోజు రాత్రి.. ఒంటి గంట సమయానికి అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షలకు చేరుకుందన్నారు. నవంబర్‌ 19, శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉదయం 5:30 గంటలకు 3.2 లక్షలు దాటిందని పేర్కొన్నారు. పింఛా తెగిపోయి మొత్తం నీరంతా ఒకేసారి అన్నమయ్యకు రాడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే, 19వ తేదీ ఉదయం 3.2 లక్షలు దాటిందని, అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇంత నీరు ఎప్పుడూ రాలేదని వివరించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈపరిస్థితి తలెత్తిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారని.. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యిందని అన్నారు. వాలంటీర్, వీఆర్వోలనుంచి మొత్తం అందర్నీ అలర్ట్‌ చేశారు. అలాగే అన్నమయ్య కింద కుడివైపు ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు, హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించారు. వీఆర్వోలద్వారా, సర్పంచులద్వారా అక్కడున్నవారందర్నీ అప్రమత్తం చేశామన్నారు. సుమారు 1250 కుటుంబాల్లోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి.. అప్పమత్తంచేశారు.
లోతట్టులో ఉన్న సుమారు 400 కుటుంబాలను ఎత్తైనా ప్రాంతాలకు తరలించారు. 19వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయిందని, 18వ తేదీ సాయంత్రం నుంచి యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి, వందలమంది ప్రాణాలను కాపాడినట్టు కలెక్టర్ వివరించారు.

వరద నీరంతా పెన్నాలోకి చేరింది :
నందులూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న 4 బస్సులు ముంపునకు గురయ్యాయి. వీటిలో ఒక బస్సు 20 మీటర్లు కింద పడింది. 10 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన బస్సుల్లో ఉన్న 45 మందిని ఎస్డీఆర్‌ఎఫ్‌ టీం కాపాడింది. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామంలో నదితీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శివాలయంలో కొంతమంది పూజలు చేస్తూ పూజారి కుటుంబం ప్రమాదానికి గురయ్యింది. ఈ రెండు ఘటనల్లోనే సుమారు 20 మంది వరకూ గల్లంతు అయి మరణించినట్టు తెలిపారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై వందలమంది ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం సాయంత్రానికల్లా హెలికాప్టర్లు చేరుకున్నాయని, శనివారం ఉదయం నుంచి ముంపు గ్రామాలకు, తాగునీరు, ఆహారం అందించామన్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తినట్టు కలెక్టర్ సీఎంకు వివరించారు. ఏకకాలంలో బుగ్గవంక, గండికోట, మైలవరం అన్నీ పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చినట్టు తెలిపారు.
ఒక్క బుగ్గ వంకనుంచే 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని, వెలిగల్లు నుంచి… పాపాఘ్నిలోకి 90 వేల క్యూసెక్కలు నీరు రాగా.. అనంతపురం నుంచి చిత్రావతిద్వారా 80వేల క్యూసెక్కులు, మైలవరం నుంచి 1.5 లక్షక్యూసెక్కులు, ఇలా మొత్తం ఈ నీరంతా పెన్నాలోకి వచ్చి చేరిందని ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

24 గంటలు గడిచినా నీటిమట్టం తగ్గలేదు :
జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను చేపడుతూనే అన్నమయ్య ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను తీవ్రం చేసినట్టు తెలిపారు. అన్నమయ్య డ్యాం తెగిన సుమారు 24 గంటల తర్వాత నీటి మట్టం తగ్గలేదన్నారు. ఈలోగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి హెలికాప్టర్లు తెప్పించుకున్నట్టు తెలిపారు. హెలికాప్టర్లు…, బోట్ల ద్వారా తాగునీరు, ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. ఆ వెంటనే వాలంటీర్లు నదీతీర ప్రాంతాల్లో ప్రతి ఇంటిని పరిశీలించినట్టు చెప్పారు. బాధిత కుటుంబాల్లో ఇంటికి చేరగానే.. ప్రతి ఒక్కరి వివరాలూ నమోదు చేసుకున్నామని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించినట్టు వివరించారు. అన్నమయ్య ప్రాజెక్టు కింద ప్రతిగ్రామానికీ ఒక డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు తహశీల్దార్లు, ఇంజినీర్లు, ఇతర అధికారుల బృందాన్ని నియమించామన్నారు. జేసీబీలు, ఇతర యంత్రాలతో పారిశుద్ధ్యంతోపాటు, ఇతర పనులను చేపట్టి ఈ గ్రామాలలో సాధారణ స్థితిని తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా మృతదేహాలు దొరికిన వారికి వెంటనే రూ.5 లక్షల పరిహారం ఇచ్చామన్నారు. రేషన్‌ సరుకులను, ముంపునకు గురైన కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం అందించినట్టు సీఎంకు కలెక్టర్ వివరించారు.

Read Also : Delhi Pollution : ఢిల్లీ కాలుష్యంపై విచారణ..ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ : సుప్రీంకోర్టు