Kotamreddy: అమరావతి ఉద్యమంలోకి కోటంరెడ్డి.. జగన్నా ఇది న్యాయమా అంటూ నిలదీత

ఆనాడు ముద్దు అయిన అమరావతి నేడు ఎందుకు వద్దు అయిందని ముక్కుసూటిగా అడిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Kotamreddy: అమరావతి ఉద్యమంలోకి కోటంరెడ్డి.. జగన్నా ఇది న్యాయమా అంటూ నిలదీత

Kotamreddy Sridhar Reddy: అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం రాబోతుందని, మూడు ముక్కలు అన్న వాళ్లు కొట్టుకు పోతారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సముచితమని సమర్థించారు.

Kotamreddy Sridhar Reddy, Amaravati
నాడు ముద్దు, నేడు వద్దు

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పడం, మడమ తిప్పడం జగన్నా ఇది న్యాయమా, ధర్మమా అంటూ ప్రశ్నించారు. ఆనాడు ముద్దు అయిన అమరావతి నేడు ఎందుకు వద్దు అయిందని ముక్కుసూటిగా అడిగారు. జగన్ మూడుముక్కల రాజధాని నిర్ణయం మార్చుకోవాలని కోరారు. వైసీపీలో ఉన్నప్పుడు పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నానని అన్నారు. ప్రధాని మోదీ గట్టిగా చెబితే రాజధాని ఎక్కడికి పోదని విశ్వాసం వ్యక్తం చేశారు.

Kotamreddy Amaravati
త్వరలో రాజకీయ సునామి

అమరావతి రైతులు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఆశ్రయం ఇచ్చానని అప్పటి నుంచే వైసీపీలో తనకు కష్టాలు మొదలయ్యాయని కోటంరెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి మట్టి పెళ్ళ కూడా ఎవ్వరూ తీసుకెళ్ళలేరని అన్నారు. అమరావతికి అండగా వున్న పార్టీ త్వరలో రాజకీయ సునామి సృష్టిస్తుందని.. ఆ సునామీలో అమరావతిని ముక్కలు చేయాలనుకొనే వారు కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు. అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన వారికోసం ప్రపంచంలో ఎత్తైన స్మారక స్తూపం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

Also Read: నీకు దమ్ముంటే రా.. ఎమ్మెల్యే మేకపాటికి సవాల్ విసిరిన చేజర్ల సుబ్బారెడ్డి

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో వైసీపీ అధిష్టానం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.