Corona Omicron : ఒమిక్రాన్ ఎందుకంత వేగంగా విస్తరిస్తుందో తెలిసింది

ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వెనుక కారణాలను పరిశోధిస్తున్న క్రమంలో మనుషుల శరీరంపై ఓమిక్రాన్ 21 గంటల పాటు ఉండడమే ఈ వ్యాప్తికి కారణమని తేల్చారు

Corona Omicron : ఒమిక్రాన్ ఎందుకంత వేగంగా విస్తరిస్తుందో తెలిసింది

Omicron

Corona Omicron: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పటికప్పుడు తగ్గినట్లే తగ్గి..కొత్త వేరియంట్ల రూపంలో వ్యాప్తి కొనసాగిస్తుంది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. జనవరి 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం కేసులు ఓమిక్రాన్ బాధితులే ఉన్నట్లు తెలిసింది. మనుషుల శరీరంపై ఓమిక్రాన్ 21 గంటల పాటు ఉండడమే ఈ వ్యాప్తికి కారణమని పరిశోధకులు తేల్చారు. ఇంత వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి చెందడం వెనుక కారణాలను పరిశోధిస్తున్న క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read: Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?

ఓమిక్రాన్ వేరియంట్ లో ఉన్న కరోనా వైరస్ మనుషుల శరీరంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని..మరేఇతర కరోనా వేరియంట్లు అంత సమయం పాటు ఉండలేదని జపాన్ కు చెందిన “క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్” పరిశోధకులు తేల్చారు. కరోనా ఒరిజినల్ వైరస్ గా పేర్కొంటున్న “SARS-CoV-2 ఉహాన్” రకాన్ని.. ఇటీవల వెలుగు చూసిన ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లపై .. క్యోటో మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం జరిపారు. ఇంకా పరిశోధన దశలో ఉన్న ఈ అధ్యాయానికి సంబందించిన పలు విషయాలను ఇటీవల “BioRxiv” అనే సర్వర్ లో పొందుపరిచారు.

ఆయా పరిశోధనల మేరకు.. మిగతా వేరియంట్లతో పోలిస్తే.. ఓమిక్రాన్ వేరియంట్ కు బాహ్య వాతావరణాన్ని తట్టుకునే శక్తీ ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. తద్వారా ఈ వైరస్ లో సంక్రమణ శక్తీ అధికంగా ఉండి..ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. మానవ శరీరంపై ఒరిజినల్ ఉహాన్ రకానికి సగటు మనుగడ సమయం 8.6 గంటలుగా ఉండగా, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా వేరియంట్ 19.1 గంటలు, గామా వేరియంట్ 11 గంటలు, డెల్టా వేరియంట్ 16.8 గంటలు మరియు ఓమిక్రాన్ వేరియంట్ 21.1 గంటల పాటు ఉంటుంది.

Also read: Governor Tamilisai: సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లాకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక అభినందనలు

అదే సమయంలో ప్లాస్టిక్ ఉపరితలాలపై, ఒరిజినల్ ఉహాన్ రకం 56 గంటల పాటు, ఆల్ఫా 191.3 గంటల పాటు, బీటా 156.6 గంటల పాటు, గామా 59.3 గంటల పాటు, డెల్టా వేరియంట్‌ 114 గంటల పాటు ఉంటుండగా..ఓమిక్రాన్ వేరియంట్ 193.5 గంటల పాటు సజీవంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కాగా ఇథనాల్ ను వాడినపుడు ఆయా వైరస్ వేరియంట్ల నిష్క్రమణ సమయం కూడా మారినట్లు పరిశోధనలో తేలింది. ఇథనాల్ శాతాన్ని 35కి పెంచి ఉపయోగించినట్లయితే.. అన్ని రకాల కరోనా వేరియంట్లను 15 సెకండ్లలోనే నశింపజేయవచ్చని మరో పరిశోధనలో తేలింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించిన శానిటైజర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ సబ్బులను ఉపయోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?