లోటస్ పాండ్ లో సందడి, షర్మిల కోసం క్యూ కడుతున్న నేతలు

లోటస్ పాండ్ లో సందడి, షర్మిల కోసం క్యూ కడుతున్న నేతలు

Jagan Sister Sharmila : హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌. దివంగత సీఎం వైఎస్‌ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పడిగాపులు లేకుండానే నేరుగా ఆమెను కలిసే వీలు దక్కేసరికి నేతలు, మాజీ అధికారులు, అభిమానులు క్యూ కడుతున్నారు. ఆహ్వానాలు, అనుమతులు అవసరం లేకుండా బార్లా తెరిచి ఉన్న గేటులోంచి ఠీవిగా లోపలికి వెళ్లివస్తున్నారు.

వీవీఐపీలు, వీఐపీలు ఎక్కువగా నివాసముండే లోటస్‌పాండ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వాలన్నా అదంతా ఈజీ కాదని అందరికీ తెలుసు. జగన్, షర్మిల ఇంట్లోకి ఎంట్రీ అంటే అదంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు జగన్..లోటస్‌పాండ్ నివాసం నుంచే రాజకీయాలు నడిపేవారు. ఏపీ సీఎం అయ్యాక కూడా కొంతకాలం జగన్‌ లోటస్‌పాండ్‌ నుంచే పని చేశారు. అదే సమయంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు పడిగాపులు పడేవారు. కానీ జగన్‌ అమరావతికి తరలి వెళ్లాక లోటస్‌పాండ్‌ కళతప్పింది. తెలంగాణలో రాజకీయపార్టీ స్థాపన ఏర్పాట్లలో షర్మిల నిమగ్నమవడంతో.. మళ్లీ ఇంతకాలానికి లోటస్‌పాండ్‌లో కళ కనిపిస్తోంది.

ఫిబ్రవరి మొదటి వారం నుంచి లోటస్‌పాండ్‌లో సందడి నెలకొంది. ఈ సందడి రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పలు జిల్లాల నేతలతో షర్మిల భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ స్థాపనకు విస్తృతస్థాయిలో మంతనాలు నడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌ వర్క్‌కు సంబంధించి ప్రిపరేషన్‌ను లోటస్‌పాండ్‌ వేదికగానే చేస్తున్నారు. వచ్చీ పోయే నేతలు, మాజీ అధికారులతో షర్మిల నివాసం దగ్గర రద్దీ కనిపిస్తోంది. మెయిన్ గేట్‌‌, ఇంటి ముఖ ద్వారం పొద్దస్తమానం తెరిచే ఉంటున్నాయి. తన తండ్రి వైఎస్‌తో సన్నిహితంగా మెలిగిన నేతలు, అధికారులను ఆహ్వానిస్తూ చర్చిస్తున్నారు షర్మిల. తెలంగాణలో వైఎస్‌ అభిమానులతో సమావేశమై చర్చిస్తున్నారు.

షర్మిల ఇళ్లు, ఆఫీస్‌ ఒకే చోట ఉండడంతో ఆమెను కలవడానికి వెళ్లేవారికి పర్మిషన్లతో పని లేకుండా చేసేశారు. తెలంగాణ జిల్లాల నుంచే వచ్చేవారు కాదు.. ఏపీ నుంచి వచ్చే అభిమానులకు సైతం ఇక్కట్లు లేకుండా గేట్లు ఓపెన్ చేసి ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు షర్మిల. గతంలో వారానికోసారి షర్మిల బెంగళూరు వెళ్లేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యేవరకు బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని, పార్టీ ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టారని తెలుస్తోంది. ఎక్కువ సేపు ఆఫీసులో ఉంటూ తనను కలుసుకోవడానికి వచ్చేవారితో సమావేశమై చర్చించేందుకు షర్మిల షెడ్యూల్‌ సిద్ధం చేసుకుంటున్నారు.