Ram Navami 2022 : రామతీర్థం శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం

ఉత్త‌రాంధ్రలోని ప్రఖ్యాత  పుణ్యక్షేత్రం విజయనగరంలోని రామ‌తీర్ధంలో  శ్రీ‌రామ‌న‌వమి  కళ్యాణం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Ram Navami 2022 : రామతీర్థం శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం

Ramatheertham

Ram Navami 2022 : ఉత్త‌రాంధ్రలోని ప్రఖ్యాత  పుణ్యక్షేత్రం విజయనగరంలోని రామ‌తీర్ధంలో  శ్రీ‌రామ‌న‌వమి  కళ్యాణం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జరిగే సీతారాముల క‌ళ్యాణాన్ని ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు విస్తృత‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సీతారాముల క‌ళ్యాణాన్ని భ‌క్తులు తిల‌కించేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. ఈ ఏడాది జ‌రుగుతున్న క‌ళ్యాణోత్స‌వానికి భ‌క్తులంద‌రినీ ఆహ్వానిస్తున్న‌ట్టు అధికారులు ప్రకటించారు.

స్వామి వారి క‌ళ్యాణానికి రామ‌తీర్ధం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్ధం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌నం చేసుకొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా తాగునీరు, అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి రామ‌తీర్ధంలో ప‌ర్య‌టించి సీతారాముల క‌ళ్యాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌పై రెవిన్యూ అధికారులు, ఆల‌య అధికారుల‌తో స‌మీక్షించారు.

తొలుత క‌ళ్యాణం జ‌రిగే మండ‌పంలో ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. రెండేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు తిల‌కించేందుకు వీలుగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఆల‌యం వెలుప‌ల నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. భ‌క్తుల కోసం తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు 108, 104 అంబులెన్సులు సిద్ధంగా వుంచాల‌ని, వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు త‌గిన‌న్ని అందుబాటులో వుంచాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు త‌లంబ్రాలు, పాన‌కం అందించేదుకు రెండు కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి హాజ‌ర‌య్యే ప‌ది వేల మంది భ‌క్తుల‌కు అన్న‌దానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
Also Read : AP Cabinet : ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
ఇదిలా ఉండగా, కళ్యాణ ఉత్సవాలకు ఆలయ అనువంశిక ధర్మకర్త, ఛైర్మన్ అశోక్ గజపతిరాజు కుటుంబం ప్రతీ ఏటా పట్టువస్త్ర్రాలు సమర్పిస్తుంటారు. ఈ ఏడాది ఆయన వస్తారో లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆలయ అధికారులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న అశోక్…కళ్యాణోత్సవంలో పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు ఎవరు సమర్పిస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జిల్లాకు చెందిన మంత్రులు రాజీనామాలు చేయడంతో పట్టు వస్త్ర్రాల సమర్పణ చర్చనీయాంశమైంది.