Heavy Rain Forecast : బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం..మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన | Low pressure in the Bay of Bengal on the 29th of november, A heavy rain forecast for AP, Tamil Nadu and Puducherry

Heavy Rain Forecast : బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం..మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది.

Heavy Rain Forecast : బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం..మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Low pressure in the Bay of Bengal : బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది. నెల్లూరు, రాయలసీమ జిల్లాలను వర్షాలు వీడట్లేదు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపించనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. పది రోజుల క్రితం వర్షాలకు గత వారం వరదలతో విలవిల్లాడాయి నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు. ఇప్పుడు మళ్లీ వర్ష హెచ్చరికలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Tomato Price : దిగొచ్చిన టమాట ధర.. కిలో రూ.20

వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని కలెక్టర్‌ హరి నారాయణన్‌ అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్ష హెచ్చరికలతో చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. కాజ్‌వేలు దాటొద్దని హెచ్చరించారు.

ఈశాన్య రుతుపవనాల తీవ్రత, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో..తమిళనాడు, పుదుచ్చేరికి భారీ వర్ష హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. తమిళనాడులో గురువారం రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 17 జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. 12 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు 10 వేల ఇళ్లు నీట మునిగాయి. బాధితులను రెస్క్యూ టీమ్స్‌ రక్షిస్తున్నాయి. పలు జిల్లాల్లో రోడ్లు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లు చెరువులను, రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి.

Massive Fraud : అధిక వడ్డీల పేరుతో రూ.200 కోట్లు మోసం..బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు

కన్నియాకుమారి జిల్లాలో కురిసిన వర్షాలకు 12 గిరిజన గ్రామాలు దీవులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగపట్టినం, పెరంబలూరు, పుదుకోట జిల్లాల్లో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్లు, తిరునల్వేలి, శివగంగ, మదురై, తేని, విల్లుపురం సహా 27 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. వాహనాల రాకోపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ఇటీవల కాలంలో రెండు సార్లు భారీ వర్షాలతో చెన్నై మునిగింది. ఆ కష్టాల నుంచి తేరుకుంటున్న నగరవాసులను మళ్లీ వర్షాలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. చెన్నై, సబర్బన్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు కాలనీలు, ఇళ్లను ముంచెత్తింది. మురికివాడలు, చిన్న చిన్న కాలనీల నుంచి ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు …విధులకు హాజరుకాలేకపోతున్నారు. రాయపేట, రాయపురం, మైలాపూరు, అడయారు, అంబత్తూరు, తాంబరం, వేళచ్చేరి, కోయంబేడు ప్రాంతాల్లో రెండడుగుల మేర వర్షపునీరు వరదలా ప్రవహించింది.

Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు

విరుగంబాక్కంలోని సుబ్రమణియన్‌ వీధికి ఇరువైపులా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. టి.నగర్, హబీబుల్లా రోడ్డు, పాండీ బజార్‌, వళ్లువర్‌ కోట్టం, నుంగంబాక్కంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కోడంబాక్కం, వడపళని, రంగరాజపురం, కలైంజర్‌నగర్‌, రాజాజీనగర్‌, కార్గిల్‌ నగర్‌, చార్లెస్ నగర్‌లోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటిని తొలగించేందుకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నైలోని 91 పునారావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నారు.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో ఇవాళ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. కన్నియాకుమారి, రామనాధపురం, తిరుచ్చి, కరూరు, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో కొని చోట్లు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెదర్‌ బులిటెన్‌లో పేర్కొంది. కొమోరిన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపాను ప్రభావం వల్ల గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

×