మదనపల్లె జంట హత్యలు : అక్కా చెల్లెళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ ఏమయ్యాయి ? మార్పులు చేస్తున్నది ఎవరు ?

మదనపల్లె జంట హత్యలు : అక్కా చెల్లెళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ ఏమయ్యాయి ? మార్పులు చేస్తున్నది ఎవరు ?

Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూడ్రోజుల ముందు నుంచి మాత్రమే అలేఖ్య సోషల్ మీడియా అకౌంట్స్‌లో వివాదాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత వారికి ఏమైందన్న ఆసక్తి ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. వారి హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలో మార్పులు జరుగుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ : –
మృతులు అలేఖ్య, సాయిదివ్య ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండేవారు. ఈనెల 21న శివ ఈజ్ కమింగ్ అని పోస్టుపెట్టిన అలేఖ్య, తిరిగి 22న కృష్ణుడి బొమ్మతో సెల్ఫీ దిగిన అలేఖ్య.. మోహినీ అనే హ్యాష్ ట్యాగ్ ను వాడింది. ఫేస్‌బుక్‌ ఖాతా పేరును మోహినీగా మార్చింది. అదే రోజు వేరే మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలతో మరో పోస్టు చేసింది. హత్య జరగటానికి రెండు రోజుల ముందు కూడా అలేఖ్య సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉంది.

ఎవరో మార్పులు చేశారా ?  : –
పెద్దమ్మాయి అలేఖ్య ఫొటోనే సాయి దివ్యకు డిస్‌ప్లే పిక్చర్ గా ఎవరు మార్చారనేది తేలాల్సి ఉంది. చిన్నమ్మాయి ఖాతాకు దివ్స్ ఆలేఖ్య అని ఎవరు మార్చారనే అంశం విస్తుపోయేలా చేస్తోంది. అలేఖ్య చేసిన కొన్ని పోస్టుల కింద సాయిదివ్య కామెంట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే సాయిదివ్య అకౌంట్ లో ఎవరో మార్పులు చేశారనే సందేహాలోస్తున్నాయి.

సెట్టింగ్ లో మార్పులు : –
మరోవైపు సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు డిలిట్ అవ్వడం వెనక ఎవరి పాత్రయినా ఉందా? అన్న అనుమానాలొస్తున్నాయి. అలేఖ్య అకౌంట్ ప్రైవేటులో ఉండేదని, ఆమె అనుమతించిన వారే ఈ పోస్టులను చూడగలిగేవారని స్నేహితులు చెబుతున్నారు. ఈ తరుణంలో వివాదాస్పద పోస్టులను అందరూ చూడగలిగేలా ప్రైవసీ సెట్టింగులను మార్చిందెవరనేది తేలాల్సి ఉంది. ఓషో, మరో ఆధ్యాత్మికవేత్త ఫొటోలు ఎక్కువగా కనిపించేవి. అయితే ఒక్కసారిగా వివాదాస్పద పోస్టులు దర్శనమివ్వడంపై దర్యాప్తు చేయాల్సి ఉంది.

18వ తేదీన ఆఖరి పోస్టు : –
జంట హత్య కేసులో కీలకంగా మారిన వివాదాస్పద పోస్టులకు ముందు అలేఖ్య ఈనెల 18న ఆఖరి ఫొటో పెట్టింది. ఈ ఫొటోలో ఒక కారు అద్దంలోనుంచి చూస్తే అదేదో కొండ ప్రాంతంలో ముళ్లపొదలు, బండరాళ్లతో కనిపిస్తోంది. అంటే అలేఖ్య ఆ రోజు ఎక్కడికెళ్లినట్లు? ఇలాంటి చిక్కుముళ్లను సైబర్ నిపుణులు విప్పాల్సి ఉంది. అక్కా చెల్లెళ్ల సామాజిక మాధ్యమాల ఖాతాలు పరిశీలించాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇద్దరి అక్కాచెల్లెళ్లకు ఖాతాలు కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నాయి.