Minister Dadisetti Raja : అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు.. ఎన్టీఆర్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సీనియర్ ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడంటూ సంచలన కామెంట్స్ చేశారాయన.

Minister Dadisetti Raja : అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు.. ఎన్టీఆర్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Minister Dadisetti Raja : సీనియర్ ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడంటూ సంచలన కామెంట్స్ చేశారాయన. ముఖ్యమంత్రిగా ఉండి రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ కు, వైఎస్ఆర్ కు అసలు పోలికే లేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి దాడిశెట్టి రాజా.

రాష్ట్రం మొత్తం గుప్పెట్లో ఉండగా, నాదెండ్ల భాస్కర్ రావుతో ఒకసారి, చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చిన నాటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య ఇలా మాటల యుద్ధం జరుగుతుండగా.. ప్రస్తుతం దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారం రేపుతున్నాయి.

”దేశ చరిత్రలోనే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వెన్నుపోటుతో పదవిని కోల్పోయిన అసమర్థుడు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్, వైఎస్ఆర్ మధ్య పోలికే లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వైఎస్ఆర్ పేదల గురించి ఆలోచించే వ్యక్తి” అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో పెను దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు సమర్థిస్తుంటే.. టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఎం జగన్ తీరుపై వారు ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని చెబుతున్నారు. ఎన్టీఆర్ అంటే తనకూ అభిమానం ఉందంటూ ఏకంగా సీఎం జగనే.. ఆచితూచి మాట్లాడుతుంటే.. మంత్రి దాడిశెట్టి రాజా మాత్రం నోటికి పని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచాయి.

అటు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సైతం.. ఎన్టీఆర్ ఇష్యూలో హాట్ కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల నిజమైన ఎన్టీఆర్ అభిమానుల కంటే ఆయనను రాజకీయంగా వాడుకునే చంద్రబాబు లాంటి వాళ్లే ఎక్కువగా బాధపడుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు.

యూనివర్సిటీ కంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పెద్ద విషయమని ఆమె తెలిపారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలుస్తానని.. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తాను కోరుతానని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకూడదని చంద్రబాబు అప్పటి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కొన్ని మీడియాల్లో తన గురించి వచ్చిన అంశాల్లో వాస్తవం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో తాను ఏ రోజూ కూడా పార్టీ వ్యవహారాల్లో తలదూర్చలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ను ఉద్దేశించి మంత్రి దాడిశెట్టి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. అవినీతి వ్యక్తులకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నీ నియోజకవర్గంలో కొండలు, గుట్టలు ఏమయ్యాయో నీకు తెలుసా? అని మంత్రిని ప్రశ్నించారు. పేకాట క్లబ్ లు నడిపేవారు, ఇసుక మాఫియాకు ఎన్టీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలితే నాలుక కోస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.