నేనేంటో చూపిస్తా : మంత్రి గంగుల కమలాకర్ స్వీట్ వార్నింగ్!

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 12:06 PM IST
నేనేంటో చూపిస్తా : మంత్రి గంగుల కమలాకర్ స్వీట్ వార్నింగ్!

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలను ఆయన హెచ్చరిస్తున్నారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు… కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదంటున్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ వార్నింగ్‌ సొంత పార్టీలో వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారికేనని జనాలు అంటున్నారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్ ఇలాంటి డైలాగ్‌లు విసరాడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. కరీంనగర్ జిల్లా రాజకీయలను కొత్తగా మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చాలా చురుకుగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి కావాలనే తన కల నేరవేరడంతో… ఇక తానేంటో నిరూపించుకొనే పనిలో పడ్డారట.

అదే ఫార్మూలా ఫాలో :
మొన్నటి వరకు జిల్లా రాజకీయాలను మంత్రి ఈటెల రాజేందర్ శాసిస్తే… ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కమలాకర్ తన కనుసన్నల్లో అంతా నడిచేలా పావులు కదుపుతున్నారని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది తన ఓటమికి పని చేస్తున్నారని పలుమార్లు కమలాకర్ తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. కానీ, ఎవరనీ నేరుగా నిందించలేని పరిస్థితిలోనే ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచారు. తన ఓటమి కోసం ప్రయత్నించిని వారి జాబితా తెలిసినా వారి పేర్లను బయటపెట్టకుండా ఉన్నారు. సమయం రాకపోతుందా? వారు చిక్కకపోతారా అని వెయిట్ అండ్ సీ ఫార్ములా ఫాలో అయ్యారట.

కమలాకర్ ఊహించినట్లుగా ఆ రోజు రానే వచ్చింది. అది కూడా మున్సిపాలిటీ ఎన్నికల రూపంలో. మొన్నటి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి లిస్టును తయారు చేసి పెట్టుకున్న కమలాకర్… ఇప్పుడు వారిని ఏరిపారేసే పనిలో పడ్డారని అంటున్నారు. అందుకే వెన్నుపోటు… అనే డైలాగ్‌ను వారిపై విసిరారట. పార్టీ శ్రేయస్సును కోరుకునే మంత్రిగా వెన్నుపోటుదారులకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆ వెన్నుపోటు టీమ్‌లో ఎంత మంది ఉన్నారన్న విషయం మాత్రం మంత్రి గారికే తెలియాలంటున్నారు అనుచరులు.

వెన్నుపోటు టీంలో ఎంతమంది?:
వెన్నుపోటుదారుల లిస్టులో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో పాటు సిటింగ్ కార్పొరేటర్లు ఉన్నారంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్‌ను ఓడించేందుకు వారంతా గట్టిగా ప్రయత్నించారట. ఆ నేతలంతా బీజేపీకి పరోక్షంగా మద్దుతిచ్చారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గంగుల నిర్వహించిన మీడియా సమావేశానికి మాజీ మేయర్ గైర్హాజరవడం చర్చనీయంశమైంది. వీరిద్దరికీ పొసగడం లేదన్న ప్రచారానికి ఇది మరింత బలాన్నిస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలను మంత్రి గంగుల చాలెంజింగ్‌గా తీసుకుంటున్నారని చెబుతున్నారు. కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

పార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలు.. గెలుపు కోసం ఏం చేయాలనే దానిపై ప్రతి ఒక్క అభ్యర్థికి వ్యూహరచన చేసి చెబుతున్నారట. అభివృద్ధే అజెండాగా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గతంలో గంగులకు వ్యతిరేకంగా పనిచేసి వెన్నుపోటుదారులుగా పేరు తెచ్చుకున్న వారికి టికెట్ రావడం, రాకపోవడం పక్కన పెడితే వారిపై గంగుల వైఖరి ఎలా ఉండబోతుందనే ఆసక్తిగా మారింది. ఒకవేళ వారు పోటిలోకి వస్తే గంగుల వారికి ప్రచారం చేస్తారా? లైట్ తీసుకుంటారా అనేది ప్రస్తుతం పార్టీలోనూ, బయట జనాల్లోనూ జరుగుతున్న చర్చ.