పంచాయతీ ఎన్నికలు : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం!

పంచాయతీ ఎన్నికలు : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం!

AP Panchayat elections : పంచాయతీ ఎన్నికలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం వాదిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అప్పీల్‌పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన కోర్టు తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు లైన్‌క్లియర్ అయింది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్‌ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వకేట్ జనరల్‌ ఇప్పటికే కోర్టుకు వివరించారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికలకు ఓకే చెప్పింది. ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరి 23న తొలిదశ ఎన్నికలకు.. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది.

జనవరి 31న మూడో దశ.. ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 5న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ.. ఫిబ్రవరి 13 న మూడోదశ.. ఫిబ్రవరి 17న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తారు.