Pawan Kalyan: మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటని పవన్ కల్యాణ్ నిలదీశారు.

Pawan Kalyan: మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

Nadendla Manohar, Pawan Kalyan

Updated On : October 20, 2023 / 6:57 PM IST

Nadendla Manohar-JanaSena: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం మారాక విచారణ జరిపిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమ్మఒడి పథకంలో స్కాం జరిగిందని చెప్పారు.

ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక అవకతవకలు జరిగాయన్న అనుమానాలున్నాయని తెలిపారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుందని, విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపైనే తొలి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ సర్కారు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని చెప్పారు.

ఉచ్చారణ కోసం అన్ని కోట్లా?

కేవలం ఉచ్చారణ కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యానారాయణ అమెరికన్ యాక్సెంట్లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటని అన్నారు. సీబీఎస్ఈ అఫిలియేషన్ సంగతి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జగన్ హయాంలో విద్యా రంగంలోని స్కాముల్లోని పాత్రధారులు జైలుకెళ్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తమ గురించి వెటకారంగా మాట్లాడినా తాము పట్టించుకోబోమని తెలిపారు. ప్రభుత్వం చేసుకున్న ఈటీఎస్, ఐబీ ఒప్పందాల మీదున్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

అన్ని ఒప్పందాలా?: నాదెండ్ల

పేదలకు నాణ్యమైన విద్య పేరుతో వైసీపీ ప్రభుత్వం ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు చేసుకుంటోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీచర్లకు జీతాలివ్వలేకపోతోందని, ఇదే సమయంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోందని అన్నారు. ప్రాథమిక అంశాలను పక్కన పెడుతూ విద్యా రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెడుతుండడం ఏంటని నిలదీశారు.

టోఫెల్ శిక్షణ కోసం 54 పేజీల ఒప్పందం చేసుకుందని, ఆ ఒప్పందాన్ని బొత్స కనీసం చదివాలని నాదెండ్ల అన్నారు. దాదాపు 5.71 లక్షల మంది విద్యార్థుల పేరుతో అమ్మ ఒడి నిధులు, విద్యా కానుక నిధులు పక్కదారి పట్టాయని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Chandrababu : చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్.. ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు