Pawan Kalyan: వైసీపీకి 48 గంటలు గడువిస్తున్నా.. స్టీల్ ప్లాంట్‌పై స్పందించకుంటే..!

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ.. కూర్మన్న పాలెం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నినదించారు. 48 గంటల్లో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan: వైసీపీకి 48 గంటలు గడువిస్తున్నా.. స్టీల్ ప్లాంట్‌పై స్పందించకుంటే..!

Pawan

Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం చేస్తున్న వారికి సంఘీభావంగా.. కూర్మన్నపాలెంలో నిర్వహించిన సంఘీభావ సభలో జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జనానికి చెప్పారు. ప్రైవేటీకరణ ప్రక్రియ అన్నది.. మోదీ ప్రభుత్వంతోనే మొదలు కాలేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతుంటే.. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాఫీలు తాగడానికి పార్లమెంట్ కు వెళ్తున్నారా.. అంటూ ఆగ్రహించారు.

ప్రజా సమస్యలపై.. తననే పోరాడాలని అన్ని పార్టీల వాళ్లూ అంటుంటారని పవన్ చెప్పారు. చివరికి తన పార్టీ మహిళలపై దాడులు జరిగినప్పుడు.. ఒంటరిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పారిపోయే వ్యక్తిని కానని.. ప్రజల కోసం నిలబడతానని. కలబడతానని అన్నారు. ముందడుగే తనకు తెలుసని.. పారిపోవడం తెలియని వ్యక్తిని తాను అని పవన్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది త్యాగాలతో ఏర్పడిందన్న పవన్.. ఈ వాస్తవాలను ఇప్పటి తరం తెలుసుకోవాలని యువతను కోరారు.

కేంద్రం తీసుకొచ్చిన ఎన్నో బిల్లులకు.. వైసీపీ ఎంపీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చారని పవన్ చెప్పారు. అలాంటి ఎంపీలు.. స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని.. ప్రశ్నించారు. వైసీపీ పాలకులకు తెలిసిందల్లా.. కాంట్రాక్టులు, డబ్బులు మాత్రమే అని.. ప్రజల కష్టాలు ఏ మాత్రం తెలియవని ఆరోపించారు. రైతుల ప్రాణాలు పోయినా.. నిర్వాసితుల ప్రాణాలు పోయినా.. వారికి పట్టింపు లేదని కామెంట్ చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారితో గొడవ పెట్టుకునేందుకు వైసీపీ నాయకులకు ధైర్యం ఉందని.. అలాంటి నేతలు ప్రజాసేవ కోసం మాత్రం ముందుకు రావడం లేదని పవన్ విమర్శించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలియవన్న పవన్.. ఇక్కడ ఉన్న ఇబ్బందులను రాష్ట్ర నేతలే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కానీ.. వైసీపీ నాయకులు చెప్పేదొకటి.. చేసేదొకటి అని.. వారి మాటలకు అర్థాలే వేరని.. అలాంటి వాటిని తాము నమ్మేదే లేదని పవన్ తేల్చి చెప్పారు.

వైసీపీ నాయకులకు తాను 48 గంటలు గడువు ఇస్తున్నానని.. స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైసీపీ నాయకులు పోరాటాన్ని చేయకపోతే.. తానే స్వయంగా బరిలోకి దిగి ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని.. త్యాగాలను వృథా కానివ్వబోమని స్పష్టం చేశారు.

మరో వైపు.. సభలో తన అభిమానులు చేసిన హంగామాపై.. పవన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. తనను పవర్ స్టార్ అని పిలవొద్దని చెప్పారు. సంస్కారం లేదా.. అంటూ మందలించారు. అలాగే.. తెలంగాణ ఉద్యమం గురించి కూడా పవన్ మాట్లాడారు. తెలంగాణ వాళ్లు అంతా కలిసి కొట్లాడితేనే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. అన్నారు. ఆంధ్రా వాళ్లలో ఆ ఐక్యత లేదంటూ ఆవేదన చెందారు.