Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్

Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్

Phone Tapping Row

Phone Tapping Row : మాజీమంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఏపీలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. టెన్త్ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముద్దాయిలను పట్టుకున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం దానికి ప్రబల నిదర్శనం అనన్నారాయన.

ప్రత్యర్థులను సాధించడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ ను జగన్ ప్రభుత్వం ఉపయోగించడం నిత్యకృత్యంగా మారడం నిజం కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. మూడేళ్ల తన పాలనలో జగన్ ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.(Phone Tapping Row)

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు.

ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి వాస్తవాలతో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రతిపక్షనేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ ముఖ్యనేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో ముఖ్యమంత్రి బయటపెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని వ రామయ్య కోరారు.

ఫోన్ ట్యాపింగ్ కు నైతికబాధ్యత వహిస్తూ జగన్ ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్ పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలను వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Sajjala : నారాయణ అరెస్టుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి నారాయణ అరెస్ట్ కి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని, దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు.

ఫోన్లను ట్యాప్ చేసి నారాయణను అరెస్ట్ చేశాం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఇది చాలా తీవ్రమైన అంశం అని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా అరెస్టు చేశారా? ట్యాప్ చేయడం ద్వారా అరెస్టు చేశారా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్నట్లయితే కనుక.. ప్రభుత్వమే పెద్ద నేరానికి పాల్పడినట్టు అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ వ్యవహారం ఏకంగా సీఎం జగన్ ను కూడా ఇరికిస్తుందని చెబుతున్నారు.