Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం.. భారీ బహిరంగ సభ
ప్రజాసింహ గర్జన పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.

Ramachandra Yadav
Andhra Pradesh – Ramachandra Yadav: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు (Chittoor) జిల్లాలోని పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త, బీసీ నేత బోడె రామచంద్ర యాదవ్ ఈ పార్టీని స్థాపించారు. గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ప్రాంగణంలో ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.
తమ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ (BCYP) అని బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ప్రజాసింహ గర్జన పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కొత్త పార్టీ పుట్టుకురావడం గమనార్హం.
అప్పట్లో ఎన్టీఆర్ కూడా ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తలపించేలా ఇప్పుడు మళ్లీ అంతే సమయం ఎన్నికలకు ఉండగా కొత్త పార్టీ ఆవిర్భవించింది.
ఇవాళ బోడె రామచంద్ర యాదవ్ పార్టీ ఏర్పాటుకు ముందు ఏపీలోని వాలంటరీ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు నెలకు రూ. 5 వేలు మాత్రమే ఇస్తూ వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇటీవల వైసీపీ సమావేశం అయ్యాక, అక్కడ రోడ్డుపై వారితో చెత్త ఎత్తించారని అన్నారు.
తాము ఆ యువతకు బంగారు బాట నిర్మించాలని వస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకుగానే తమను చూస్తున్నాయని చెప్పారు.