Rudraraju Gidugu: కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు.. వెన్నుపోటు పొడిచి పారిపోయాడు

కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.

Rudraraju Gidugu: కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు.. వెన్నుపోటు పొడిచి పారిపోయాడు

Rudraraju Gidugu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు 10 టీవీతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి(kiran kumar reddy) తీరును ఖండించారు. కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు.

‘కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉంటే వదిలి వెళ్తున్నారు. చేతకాని దద్దమ్మ.. పార్టీ పెట్టుకొని పోటీ చేయకుండా వెన్నుచూపి పారిపోయారు. ఈ రోజు బీజేపీ నియంతృత్వ ధోరణి పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసమర్థుడైన కిరణ్ పార్టీని వీడినా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది? రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రత్యేక హోదా ఊసే లేదు. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఏపీ, తెలంగాణలో ఎలాంటి ఉపయోగం లేదు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కిరణ్ పాచిక పారదు. అక్కడ 130 స్థానాలతో కాంగ్రెస్ గెలవబోతుంద’ని గిడుగు రుద్రరాజు అన్నారు.

Also Read: అందుకే బీజేపీలో చేరా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

బీజేపీలో చేరడం దుర్మార్గం: వీహెచ్
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (V Hanumantha Rao) దుయ్యబట్టారు. ‘కనీసం మంత్రి కూడా చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు బద్ధ శత్రువుగా ఉన్న బీజేపీలో చేరడం దుర్మార్గం. సోనియమ్మకు ఆరోగ్యం బాగా లేకున్నా పార్టీ నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పార్టీకి మంచి ఊపు తెస్తున్నారు.

ఇలాంటి తరుణంలో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కిరణ్. ఇలాంటి వ్యక్తిని బీజేపీ కూడా నమ్మవద్దు. ఇలాంటి వ్యక్తికి సరైన సమయంలో బుద్ధి చెప్పాలి. కార్యకర్తలు బాగా కష్టపడి పార్టీని నిలబెట్టుకుంటున్నారు. కిరణ్ బాగా సంపాదించాడని అంటున్నారు. ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలో చేరినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాల’ని వీహెచ్ అన్నారు.