Kiran kumar Reddy : అందుకే బీజేపీలో చేరా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. రోజు రోజుకు దిగజారిపోతున్నా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Kiran kumar Reddy :  అందుకే బీజేపీలో చేరా.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy Joins BJP (Pic: @BJP4Andhra)

kiran kumar Reddy  : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. అరుణ్ సింగ్ , ప్రహ్లాద్ జోషిలు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అందించి బీజేపీ కండువా కప్పారు.

ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు.. తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో మొదటిసారి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని పార్టీని బలోపేతం చేయాలనే బాధ్యతతో పార్టీలో చేరానని వెల్లడించిన ఆయన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించటంలేదని, ఆ దిశగా ఆలోచించటం లేదన్నారు.

Kiran Kumar Reddy Joins BJP

Kiran Kumar Reddy Joins BJP (Pic: @BJP4Andhra)

తాను కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని.. ‘నా రాజు చాలా తెలివైనవాడు, సొంతంగా ఆలోచించడు, ఎవరి సలహాలు వినడు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర
విభజన కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదని.. ఆ నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిందని అన్నారు.

బీజేపీ ఎలా ఎదుగుతోంది? కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు దిగజారుతోంది అని విశ్లేషించే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు బీజేపీకి, ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా నాయకత్వానికి ఇస్తున్న మద్దతును స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని ‘మేమే కరెక్టు.. మా నిర్ణయాలే కరెక్టు’ అనే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. నాయకులంతా చాలా కష్టపడినందువల్లే బీజేపీ దేశంలో ఈ స్థాయికి చేరుకుందని.. అందరికి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నందుకే బీజేపీకి ప్రజలు దగ్గర అయ్యారని అన్నారు. బీజేపీలో ప్రతీ నాయకుడు కష్టపడి పనిచేస్తారని.. ముఖ్యంగా మోదీ వల్లనే ఈరోజు బీజేపీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. దేశం కోసం మోదీ పడే కృషికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని స్పష్టం చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

స్వాగతించిన సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. ‘కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఆయనకు ఉదయం ఫోను చేసి శుభాకాంక్షలు తెలిపాను. వారితో త్వరలోనే సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిస్తాను. వారి చేరికతో రాష్ట్రంలో బిజెపి మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని నమ్ముతున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామ’ని సోము వీర్రాజు అన్నారు.