జనసేనకు బీజేపీ షాక్! : సోము వీర్రాజు వ్యాఖ్యలతో నిర్వేదం

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 07:22 AM IST
జనసేనకు బీజేపీ షాక్! : సోము వీర్రాజు వ్యాఖ్యలతో నిర్వేదం

Somu Veerraju comments : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ఎన్నికల్లో పోటీకి చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అధికార వైసీపీ కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి ప్రకటించే విషయంలో కాస్తా వెనుకబడింది. పోటీ విషయంలో ఇరుపార్టీలు క్లారిటీకి రాలేకపోయాయి. అభ్యర్థి ఎవరన్న సంగతి పక్కనపెడితే.. కనీసం ఏపార్టీ తరపున అభ్యర్థిని నిలపాలన్న విషయంలోనూ ఈ రెండు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అయితే ఇదంతా మొన్నటి మాట. శనివారంతో సీన్‌ మారింది. తిరుపతి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రసంగంతో… పోటీ ఎవరు చేస్తారన్నది తేలిపోయింది. పోటీపై ఓ క్లారిటీ వచ్చేసినట్టయ్యింది. బీజేపీ అభ్యర్థిలో బరిలోకి దిగుతారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఆయన కమల శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్‌ బైపోల్‌లో బీజేఏపీ అభ్యర్థిని గెలిపిస్తే.. తిరుపతికి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందని ప్రకటించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు : –
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో పోటీ నుంచి తప్పుకొని బీజేపీ విజయాలకు కృషిచేసిన తమకు తిరుపతి పార్లమెంట్ స్థానం దక్కుతుందని జనసైనికులు భావించారు. ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యే అవకాశముంది. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జనసేనకు బలముందని.. తమ పార్టీ అభ్యర్థే పోటీలో ఉంచుతామని పవన్‌ భావించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జనసేన బలపరచిన బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి 20,971 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థికి 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి.

తిరుపతి పార్లమెంట్ స్థానంలో : –
అంతేకాదు… తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, అందులోనూ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో చాలా పటిష్టంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే జనసేన అభ్యర్థికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలన్నీ చూస్తే.. తిరుపతి పార్లమెంట్ స్థానములో బీజేపీకంటే తామే బలంగా ఉన్నామని జనసేన భావిస్తోంది. ఈ నిజాలన్నింటినీ పక్కనపెట్టి, జనసేనను బుట్టలో పెట్టి తిరుపతి స్థానాన్ని బిజెపి లాక్కుందని పవన్ జనసైనికులు ఆవేదన చెందుతున్నారు.

బరిలో బీజేపీ అభ్యర్థి : –
తిరుపతిలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వాస్తవానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముందు వరకూ… బిజెపి, జనసేనలో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఆ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థి పోటీలో ఉంటారంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే సాయంత్రం జరిగిన సభలో సోము వీర్రాజు తన మాటలతో సస్పెన్స్ కు తెరదించారు. బిజెపి అభ్యర్థి బరిలో ఉంటారని… జనసేన బలపరుస్తుందని స్పష్టంగా చెప్పేశారు. సోము వీర్రాజు ప్రకటన వెనుక మరి ఎలాంటి కసరత్తు జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.

జనసేనకు షాక్: –
ఎవరు పోటీ చేయాలన్న అంశంపై రెండు పార్టీల నుంచి కొంత మంది సభ్యులతో కమిటీ వేశామని, కమిటీ ప్రతిపాదన మేరకు నిర్ణయం ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు బిజెపి పెద్దలు. మరి సోము వీర్రాజు తాజా వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి అన్నది ఇక వారే స్పష్టం చేయాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ తో సంప్రదించిన తర్వాతే సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారా…. లేక ఏకపక్షంగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు.. ఒక రకంగా జనసేనను షాక్‌కు గురి చేశాయి.