Vizag Steel Plant: కదిలిన కార్మిక లోకం.. ఢిల్లీలో రెండు రోజుల నిరసనలు!

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణతోనే సంస్థను కాపాడుకోగలమని మోడీ సర్కార్ బలంగా చెబుతుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Vizag Steel Plant: కదిలిన కార్మిక లోకం.. ఢిల్లీలో రెండు రోజుల నిరసనలు!

Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణతోనే సంస్థను కాపాడుకోగలమని మోడీ సర్కార్ బలంగా చెబుతుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, కార్మిక యూనియన్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర నిర్ణయంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. ఇది కేవలం రాజకీయ పరమైన ఉద్దేశ్యంగానే కేంద్రం కోర్టుకు సమాధానం చెప్పింది.

కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న సమయం నుండే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతుండగా విశాఖ నగరంలో కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 2,3 తేదీల్లో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు తెలిపేందుకు వేలాది మంది కార్మికులు విశాఖ నుంచి హస్తినకు బయల్దేరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించడానికి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు తరలివెళ్లారు.

ఈ నెల 2,3 తేదీల్లో జంతర్ మంతర్‌ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించిన కార్మికులు శనివారం రాత్రి విశాఖ నుంచి రైలులో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఏపీ ఏక్స్‌ప్రెస్‌లో వేలాది మంది కార్మికులు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లగా.. ఆదివారం మరికొందరు విమాన మార్గంలో వెళ్లనున్నారు. ఐదున్నర నెలలుగా పోరాడుతున్నా కేంద్రానికి తమ గోడు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్న కార్మికులు.. వేలాదిగా దువ్వాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చిచెప్పిన కార్మిక సంఘాల నేతలు .. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.