విజయవాడలో గుంపులుగా కనిపిస్తే అరెస్ట్

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 10:11 AM IST
విజయవాడలో గుంపులుగా కనిపిస్తే అరెస్ట్

విజయవాడలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. మొత్తం 64 డివిజన్లలో 42 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్న వారు బయటకు రావొద్దని హెచ్చరించారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గుంపులుగా కనిపిస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. 

విజయవాడలో పెరుగుతున్న కేసులు:
కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అలర్ట్ అయ్యారు. ఎక్కువ కేసులు విజయవాడలో వస్తుండటంతో నగరంలో 42 జోన్లను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధలను మరింత కఠినతరం చేశారు. కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించిన వాటిలో ఎలాంటి కార్యకలాపాలకు, రాకపోకలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న నిబంధనలను పాటించి ప్రజలు తమకు సహకరించాలని అధికారులు కోరారు. 

రాష్ట్రంలో 5వేల 429 కరోనా కేసులు, 80 మరణాలు:
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,602 శాంపిల్స్‌ను పరీక్షించగా 135మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాలు (38), విదేశాల నుంచి (9) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 182 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 4,261కు (మొత్తం 5,429) చేరాయి. గడిచిన 24 గంటల్లో 65మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు.. కృష్ణాజిల్లాలో మరొకరు చనిపోయారు.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,641కు చేరింది. ఇప్పటివరకు 2,540మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 80మంది చనిపోయారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులున్నాయి. 

Read: గర్భిణులు, చిన్నపిల్లల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’