Tekkali Constituency: టెక్కలిలో అచ్చెన్నాయుడు దూకుడుకు చెక్ పెడతారా.. అధికార పార్టీ నేతలంతా ఒక్కటవుతారా?

టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

Tekkali Constituency: టెక్కలిలో అచ్చెన్నాయుడు దూకుడుకు చెక్ పెడతారా.. అధికార పార్టీ నేతలంతా ఒక్కటవుతారా?

Tekkali Assembly constituency : ఉద్యమాల పురిటిగడ్డలో ఆ సెగ్మెంట్ రూటే సెపరేటు. నందమూరి తారకరామారావు దగ్గర్నుంచి.. ఎందరో మహానుభావులను చట్టసభలకు పంపిన ఘనత ఆ నియోజకవర్గం సొంతం. పొలిటికల్‌గా ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఆ సెగ్మెంట్‌లో లీడర్లు కూడా ఎక్కువే. అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో.. ఆ నియోజకవర్గంలో నిత్యం రాజకీయ వేడి రగులుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడి అడ్డాగా ఉన్న టెక్కలిలో.. తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయ్? వచ్చే ఎన్నికల్లో.. టీడీపీ అడ్డాలో.. వైసీపీ జెండా పాతేందుకు.. అధికార పార్టీ నేతలంతా గ్రూప్ పాలిటిక్స్ (Group Plitics) పక్కనపెట్టి ఒక్కటవుతారా? హ్యాట్రిక్ విక్టరీ కొట్టేందుకు.. అచ్చెన్నాయుడు (Atchannaidu) వేస్తున్న ఎత్తులేంటి? విపక్షాల నుంచి బరిలో దిగబోయే నేతలెవరు? టెక్కలి సీటులో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో.. హాట్ సీటు (Hot Seat) ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా టెక్కలి మాత్రమే. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయ్. తెలుగుదేశం (Telugu Desam Party) ఆవిర్భావం తర్వాత.. టెక్కలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు 8 సార్లు గెలిచింది. 1994లో నందమూరి తారకరామారావు (NTR) కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి.. 40 వేల 890 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి సొంతం. 2004 నుంచి 2009 వరకు టెక్కలిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. 2014 నుంచి టెక్కలి మళ్లీ తెలుగుదేశానికి అడ్డాగా మారిపోయింది. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి.. హ్యాట్రిక్ కొట్టి టెక్కలి ఎన్నికల చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అచ్చెన్నాయుడు తహతహలాడుతున్నారు. మరోవైపు.. అచ్చెన్న స్పీడుకు, దూకుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే.. పార్టీలో నెలకొన్ని గ్రూపు తగాదాలు.. క్యాడర్‌ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. వైసీపీ నేతలు ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే.. పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం కుదిరితే తప్ప.. అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది.

టెక్కలి నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి. అవి.. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం. వీటన్నింటి పరిధిలో కలిపి.. మొత్తంగా 2 లక్షల 34 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. టెక్కలిలో కాళింగ సామాజికవర్గానిదే అతి పెద్ద ఓట్ బ్యాంక్. ఆ తర్వాత.. మత్స్యకార, వెలమ సామాజికవర్గాలు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసిన.. కింజరాపు అచ్చెన్నాయుడు.. తన సమీప ప్రత్యర్థి.. వైసీపీ అభ్యర్తి.. పేరాడ తిలక్‌పై 8 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

Atchannaidu Kinjarapu

అచ్చెన్నాయుడు (Photo: Twitter)

టెక్కలి నియోజకవర్గంలో.. అచ్చెన్నాయుడికి బలమైన పార్టీ క్యాడరే బలం. 2019లో గెలిచిన నాటి నుంచి.. అచ్చెన్న నియోజకవర్గానికి అంటీముట్టకుండానే ఉంటున్నారు. పోరాటాలు, కేసులు, అరెస్టులతో చాలా కాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. పైగా.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో.. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయ్. తనకి అండగా క్యాడర్‌ కూడా కేసులతో సతమతమవుతున్నా.. అచ్చెన్నాయుడు చూసీ చూడనట్లు వ్యవహరించారనే టాక్ కూడా ఉంది. పైగా.. ఎలాంటి సమస్య ఉన్నా.. సైలెంట్‌గానే ఉండాలనే హితబోధ చేస్తూ వస్తున్నారట. దాంతో.. క్యాడర్‌లో ఆయనపై కొంత అసంతృప్తి నెలకొంది. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ.. అచ్చెన్న జోక్యం చేసుకుంటూ.. ఇంచార్జ్‌లను కాదని.. రెబల్ నేతలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. పార్టీ సీనియర్ నేతలంతా.. అచ్చెన్నపై గుర్రుగా ఉన్నారు.

టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. వైసీపీ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదంటున్నారు అచ్చెన్నాయుడు. దశాబ్దాల కలగా ఉన్న భావనపాడు పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి భూసేకరణ చేస్తే.. అక్కడ పోర్టు నిర్మాణం చేపట్టకుండా.. పోర్టుని మూలపేటకు మార్చారని.. అది కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని అంటున్నారు. ఇదంతా.. ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం ప్రోగ్రాంలో.. ప్రజలు ఎదురు తిరుగుతుండటం వల్ల.. టీడీపీ ఏ చిన్న కార్యక్రమం చేసినా.. అధికార బలంతో అడ్డుకుంటున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విరక్తి చెందాని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ తామే విజయం సాధిస్తామని నమ్మకంగా ఉన్నారు అచ్చెన్నాయుడు.

Srinivas Duvvada

దువ్వాడ శ్రీనివాస్‌ (Photo: Facebook)

లీడర్లు ఎక్కువ.. క్యాడర్ తక్కువ
ఇక.. టెక్కలిలో వైసీపీ విషయానికొస్తే.. లీడర్లు ఎక్కువ.. క్యాడర్ తక్కువ అన్నట్లుగా ఉన్నాయ్ పరిస్థితులు. రోజుకో కొత్త ఇంచార్జ్‌తో క్యాడర్ కన్ఫ్యూజన్‌కి గురవుతోంది. ఇటీవలే.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) ని ఇంచార్జ్‌గా తప్పించి.. ఆయన సతీమణి దువ్వాడ వాణిని ప్రకటించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పైగా.. వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్‌కు బదులు ఆవిడే పోటీ చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడిని ఓడించేందుకు వైసీపీ నేతలు అన్ని రకాలుగా ప్రయత్నించారు.

Perada Tilak

పేరాడ తిలక్‌ (Photo: Facebook)

సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని.. ముగ్గురు కాళింగ నేతలను ఏకం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి.. వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా చేసి.. టెక్కలిలో వైసీపీని గెలిపించే బాధ్యత అప్పజెప్పారు. అప్పుడే.. పేరాడ తిలక్‌ (Perada Tilak) ని టెక్కలి బరిలో దించడంతో పాటు గతంలో అచ్చెన్నపై పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. వీళ్లిద్దరూ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో.. దువ్వాడ శ్రీను, పేరాడ తిలక్, కిల్లి కృపారాణి (Killi Krupa Rani) మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అప్పట్నుంచి.. ఒకరికొకరు చెక్ పెట్టేందుకు.. ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తూ వస్తున్నారు. ఈ గ్రూపు తగాదాలే.. వైసీపీకి మైనస్‌గా మారుతోందనే అభిప్రాయం క్యాడర్‌ నుంచి వ్యక్తమవుతోంది.

Duvvada Vani

దువ్వాడ వాణి (Photo: Facebook)

టెక్కలి వైసీపీ ఇంచార్జ్‌గా దువ్వాడ వాణి
ఇటీవల మూలపేట పోర్టు శంకుస్థాపనలో.. సీఎం జగన్ టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ని ప్రకటించారు. ఇది జరిగిన నెలకే.. టెక్కలి వైసీపీ ఇంచార్జ్‌గా దువ్వాడ వాణి(Duvvada Vani)ని నియమించారు. మహిళా సాధికారత కోసం, మహిళలకు అవకాశమివ్వాలని తానే కోరానని.. దువ్వాడ బయటకి చెబుతున్నా.. కుటుంబ వివాదాల వల్లే.. ఆయన్ని మార్చి వాణికి అప్పగించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దువ్వాడ వాణి గతంలో అచ్చెన్నాయుడిపై.. కాంగ్రెస్ తరఫున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాంతో.. మరోసారి అచ్చెన్నను ఢీకొట్టేందుకు వాణి సిద్ధమవుతున్నారు. అయితే.. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఆవిడకు ఏ మేరకు సహకరిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే.. వైసీపీ ముగ్గురు ఇంచార్జ్‌లను మార్చడంతో.. దువ్వాడ వాణి అయినా నిలదొక్కుకుంటారా? లేక.. ఎన్నికల నాటికి కొత్త నేత ఎవరైనా తెరమీదకు వస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.

Also Read: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

మూలపేట పోర్టు, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యాయని.. అవి పూర్తయితే టెక్కలి రూపురేఖలు మారడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలొస్తాయని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీలకతీతంగా వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అంటున్నారు దువ్వాడ వాణి. అసమ్మతి నేతలందరినీ కలుపుకొని వెళతానని.. అధిష్టానం సహకారంతో.. త్వరలోనే పార్టీలోని గ్రూపు తగాదాలను పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టెక్కలిలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు దువ్వాడ వాణి.

Also Read: అధికార ప్రతిపక్షాల్లో గ్రూప్ వార్.. మైలవరంలో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి.. జనసేన కీలకం!

ఇక.. టెక్కలిలో నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో జనసేన ఫాలోవర్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నా.. ఇక్కడ ప్రభావం చూపే స్థాయిలో ఆ పార్టీ లేదనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా.. టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.