Kinjarapu Atchannaidu : చంద్రబాబుకు ప్రాణహాని ఉంది, జైల్లో ఏమైనా చేయొచ్చు- జగన్ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబుని అరెస్ట్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు. కానీ, నీకు నీ పార్టీకి ఇదొక మరణశాసనం అవుతుంది. తట్టుకోలేకపోతున్నాం. రక్తం మరిగిపోతోంది. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu – Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉందా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబుకి ప్రాణహాని ఉందని ఏపీ టీడీపీ అధక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారాయన. చంద్రబాబుని ఏం చేస్తారో అన్న భయం, ఆందోళన కలుగుతోందన్నారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అచ్చెన్నాయుడు.
తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం రోజుకు 18గంటలు పని చేసిన దార్శనిక నేతను దారుణాతి దారుణంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ అచ్చెన్నాయుడు కన్నీరు పెట్టుకున్నారు. తనకు చాలా బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. కానీ, ప్రజాస్వామ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
”కోర్టులను మేనేజ్ చేసే శక్తి మాకుంటే ఒక చిన్న కేసు, సంబంధం లేని కేసు, ఒక చిన్న కోర్టులో రిమాండ్ రాకుండా మేము చేసుకోలేమా? న్యాయానికి, ధర్మానికి, ప్రజాస్వామ్యానికి కట్టుబడిన వ్యక్తి చంద్రబాబు కాబట్టే ఈ దేశంలో ఇంకా ఇటువంటి సైకోలు ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఎక్కడో కొద్దిగా న్యాయం బతికుంది. సైకో ఆనందం అయిపోయింది. రేపు అరెస్ట్ చేస్తా, ఎల్లుండి అరెస్ట్ చేస్తా అంటూ నాలుగున్నరేళ్లుగా జగన్ చేసిన కార్యక్రమంలో సక్సెస్ అయ్యాడు. కానీ, నీకు నీ పార్టీకి ఇదొక మరణశాసనం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలో ఒక అగ్రగామిగా నిలపాలని.. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి రోజుకి 18గంటలు పని చేసిన ఒక దార్శనిక నేతని ఇంత దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే బాధగా ఉంది. తట్టుకోలేకపోతున్నాం. రక్తం మరిగిపోతోంది. కానీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులం. స్వాతంత్ర్య భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏపీ లేదా? ప్రతిపక్షాలకు నిరసన తెలియజేసే హక్కు లేదా? మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పోలీసుల వ్యవహారం చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించింది. ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపించారు. గవర్నర్ మాకు అపాయింట్ మెంట్ ఇచ్చారని చూపించకపోతే పోలీసులు మమ్మల్ని పంపించలేదు.
40 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యక్తి. దేశంలో, ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన వ్యక్తికి రిమాండ్ ఇచ్చారు. కనీసం హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వండి. ఇదేమీ కొత్తది కాదు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ని అదే విధంగా హౌస్ అరెస్ట్ చేశారు. మా నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. జైల్లో ఏమైనా చేస్తారు. అటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. మా కేడర్ ని జైల్లోకి పంపడం లేదు. మాకు భయం, ఆందోళన ఉంది. చంద్రబాబుని ఏం చేస్తారో అనే ఆందోళన ఉంది. 5కోట్ల మంది ఆంధ్రులు.. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు పౌరుడు నిన్నటి నుంచి శోకసముద్రంలోకి వెళ్లిపోయారు. ఎవరికీ మాటలు రావడం లేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. జైల్లో మా అధ్యక్షుడిని ఏమైనా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి న్యాయస్థానానికి దండం పెడుతున్నాం. ఒక వేళ కింద న్యాయస్థానం అన్యాయం చేసినా పైన్యాయస్థానం అయినా న్యాయం చేసి మా అధ్యక్షుడికి హౌస్ అరెస్ట్ కి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం” అని అచ్చెన్నాయుడు అన్నారు.