Tirupathi Lok Sabha Constituency : వెంకటేశుని సన్నిధి తిరుపతిలో ఆసక్తికర రాజకీయం..పట్టుమీద వైసీపీ..పంతం పట్టిన టీడీపీ…
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది.

tirupathi
Tirupathi Lok Sabha Constituency : తిరుపతి.. ప్రపంచానికి తెలిసిన పేరు.. తెలుసుకోవాలని ప్రపంచదేశాల భక్తులు వచ్చే ఊరు. కలియుగదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ఉన్న స్థలం.. తిరుపతి మనసు తెలుసుకొని.. తిరుపతి నుంచి ప్రపంచానికి తెలియాలని చాలా మంది నేతలు ఆశపడుతుంటారు. ఇక ఇక్కడి నుంచి పోటీ చేయడం చాలామందికి సెంటిమెంట్ కూడా ! మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ! చిరంజీవి గెలిచింది ఇక్కడే.. పవన్ బరిలోకి దిగబోయేది ఇక్కడే ! అలాంటి తిరుపతి ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది. తిరుపతితో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలు వైసీపీ ఖాతాలో ఉండగా.. ఈ మూడున్నరేళ్లలో సీన్ ఎలా మారింది.. వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? కలిసిరాని తిరుపతి పార్లమెంట్‌ను గెలిచేందుకు టీడీపీ కలిసికట్టుగా యుద్ధం చేయబోతోందా.. పవన్ కల్యాణ్ తిరుపతి అసెంబ్లీ నుంచి బరిలో దిగడం ఖాయమా.. ఆయన పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. జనసేన కోరుతున్న స్థానాలేంటి.. బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి.. తిరుపతి రాజకీయ ముఖచిత్రమ్ చెప్తోంది ఏంటి..
మెగా ఫ్యామిలీకి తిరుపతి సెంటిమెంట్‌గా మారిందా ? పవన్ తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయమా ?
తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కోట్లమందికి భక్తులకు కొంగుబంగారం వేంకటేశుడు. తిరుపతి ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుపతిలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి పలుకుబడి, పరిచయాలు ఎక్కువగానే ఉంటాయ్. ప్రపంచ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులే కాదు ప్రముఖులూ ఇక్కడికి వస్తుంటారు. అందుకే తిరుపతిలో ప్రజాప్రతినిధిగా ఉండేందుకు నేతలంతా పోటీ పడుతుంటారు. ఇక ఎంపీ స్థానం గురించి చెప్పాల్సిన పనే లేదు. రాజకీయం పైకి సైలెంట్‌గా కనిపించినా.. మంటలు మాత్రం లోపల రగులుతూనే ఉంటాయ్. చిరంజీవి ప్రజారాజ్యం అనౌన్స్ చేసింది ఇక్కడే.. ఇప్పుడు పవన్ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది ఇక్కడే.. వైసీపీ పట్టు మీద ఉంది ఇక్కడే.. టీడీపీ పంతం పట్టింది ఇక్కడే. అందుకే తిరుపతి రాజకీయంగా ఆసక్తి రేపుతోందిప్పుడు !

Gurumurthy
వివాదరహితుడు, సౌమ్యుడిగా సిట్టింగ్ ఎంపి గురుమూర్తికి పేరు
తిరుపతి పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. టీడీపీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే ఇక్కడి నుంచి విజయం సాధించగా.. రాష్ట్ర విభజన తర్వాత హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు అయింది. దీంతో వైసీపీ స్ట్రాంగ్ అయింది. 2014, 2019 సాధారణ ఎన్నికలతో పాటు.. 2021లో జరిగిన ఉపఎన్నికలోనూ వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 2019 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో… తిరుపతి ఎంపీ సీటుకు బైపోల్ జరిగింది. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి.. ఇక్కడి నుంచి విజయం సాధించారు. జగన్‌కు నమ్మినబంటు అయిన గురుమూర్తికి.. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరు ఉంది. తిరుపతి సమస్యలను పార్లమెంట్‌లో వినిపించారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణానికి అనుమతి తీసుకు వచ్చారు. విమానాశ్రయ ఆధునీకరణ కోసం భారీగా నిధులు రాబట్టకలిగారు. కేంద్రస్థాయిలో పరిష్కరించగలిగిన అన్ని సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.

mohan, rathnaprabha, lakshmi,gurumurthy
వైసీపీ నుంచి మళ్లీ గురుమూర్తి బరిలోకి దిగుతారా…టిడిపి నుండి బరిలో నిలిచేది ఎవరు
2024లో వైసీపీ తరఫున మళ్లీ గురుమూర్తి పోటీ ఖాయం అనే ప్రచారం జరుగుతున్నా.. చివరి నిమిషంలో మార్పులు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. గురుమూర్తి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నట్లు టాక్. ఆయనకు అసెంబ్లీ అవకాశం ఇస్తే.. తిరుపతి పార్లమెంట్‌లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పనబాక లక్ష్మీ పోటీ చేయగా.. ఎన్నికల తర్వాత ఆమె తిరుపతి వైపు చూడడం కూడా మానేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రత్నప్రభ కూడా పెద్దగా కనిపించలేదు. ఐతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే.. కమలం పార్టీ నుంచే అభ్యర్థి బరిలోగి దిగే అవకాశాలు ఉన్నాయ్. దీనికోసం బీజేపీ కొత్త ముఖాన్ని వెతుక్కోవాల్సిందే ! నిజానికి చంద్రబాబుకు మొదటి నుంచి పెద్దగా తిరుపతి మీద ఆసక్తి లేదు. పొత్తులో భాగంగా ఈ సీటు వదులుకోవడానికి ఆయన వెనకగడుగు వేసే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ మరోసారి బరిలో నిలవడం ఖాయం. పార్టీ ప్రాభవం కోల్పోయినా.. కొంతకాలంగా నియోజకవర్గం అంతా ఆయన పర్యటిస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతితో పాటు.. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ఈ ఏడు సెగ్మెంట్‌లు వైసీపీ ఖాతాలో ఉన్నాయ్.

karunakar reddy,pawankalyan
తిరుపతి అసెంబ్లీకి వైసీపీ నుంచి మళ్లీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఆయనే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం.. తిరుపతి అసెంబ్లీపై కనిపించే అవకాశాలు ఉన్నాయ్. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో చిరంజీవి కూడా ఇక్కడి నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాపు సామాజికవర్గానికి చెందిన బలిజలు ఇక్కడ కీలకంగా మారే చాన్స్ ఉంది. పవన్ పోటీకి దిగితే.. ఈ స్థానాన్ని టీడీపీ కచ్చితంగా వదులుకోవాల్సిన పరిస్థితి. ఐతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కూడా బలంగానే ఉన్నారు. వైసీపీ ప్రభంజనంలోనూ గత ఎన్నికల్లో ఈమె కేవలం 8వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో తిరుపతి నుంచి పోటీ చేసేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

sudhir reddy,madhusudhan
శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి మరోసారి బరిలో.. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేసే చాన్స్
శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి కూడా ఆయనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ నుంచి కోలా ఆనంద్ బలంగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే.. శ్రీకాళహస్తి స్థానాన్ని కమలం పార్టీ కోరే అవకాశంఉంది. అదే జరిగితే.. ఇక్కడి నుంచి కోలా ఆనంద్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయం.
READ ALSO : Rajampet Lok Sabha Constituency : రసవత్తరంగా రాజంపేట పార్లమెంట్ రాజకీయం….ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?

adimulam
సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం….వివాదరహితుడిగా కోనేటికి పేరు
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయిన సత్యవేడులో కోనేటి ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వివాదరహితుడిగా ఆయనకు పేరుఉంది. తన పని తాను చూసుకుంటారు తప్ప.. ఆయన చుట్టూ ఎలాంటి ఆరోపణలు లేవు. దీంతో ఈసారి కూడా కోనేటికే టికెట్ దాదాపు ఖాయం అని తెలుస్తోంది. ఐతే ఎంపీ గురుమూర్తి ఇక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. ఆఖరి నిమిషంలో ఎలాంటి మార్పులైనా జరిగే చాన్స్ ఉంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో రాజశేఖర్ పోటీ చేయగా.. ఈ మధ్యే ఆయనను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. మాజీ ఎమ్మెల్యే హేమలత కొత్త ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. హేమలత కూతురు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో సైకిల్ పార్టీ బలంగా ఉంది. దీంతో ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

venkatarathnam,sanjeevaiah
సూళ్లూరుపేట నుండి మరోమారు బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య.. టీడీపీ నుంచి పరసా వెంకటరత్నం పోటీ
సూళ్లూరుపేటలో సంజీవయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయనకే మళ్లీ టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. ఐతే సొంతపార్టీలోనే ఆయనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయ్. రెడ్డి సామాజికవర్గంలోని కొందరు నేతలతో ఆయనకు ఇబ్బందుల ఎదురవుతున్నాయ్. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పరసా వెంకటరత్నం పోటీ చేయగా.. ఈసారి ఆయనతో పాటు.. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కూడా టికెట్ ఆశిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కొత్త వ్యక్తిని టీడీపీ బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

govardhan reddy,chanramohanreddy
సర్వేపల్లి నుండి మరోసారి బరిలోకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి… డోలాయమానంలో సోమిరెడ్డి అభ్యర్థిత్వం
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. సర్వేపల్లి నుంచి నాలుగుసార్లు పోటీచేసిన సోమిరెడ్డి.. ప్రతీసారి ఓడిపోయారు. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తులకు.. పార్టీ టికెట్ ఉండదని ఆ మధ్య నారా లోకేశ్ ప్రకటన చేయగా.. సోమిరెడ్డికి టికెట్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సమీకరణాలు కుదిరితే సోమిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌కు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సర్వేపల్లి నుంచి టీడీపీ తరఫున కొత్త వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉంది.

varaprasad
గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు.. గూడూరు నుంచి ఎంపి గురుమూర్తి పోటీ చేసే అవకాశాలు
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మరో రిజర్వ్‌డ్ నియోజకవర్గం గూడూరు. వరప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఈసారి ఆయనకు పార్టీ టికెట్ అనుమానమే ! సొంత పార్టీ నుంచే వరప్రసాదరావుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం… ఆయన వ్యవహార శైలిపై గురుగా ఉంది. ఆయనకు ఈ దఫా టికెట్ ఇవొద్దని సంకేతాలు పంపుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సమీకరణాలు కుదిరితే.. ఎంపీ గురుమూర్తి గూడూరు వైసీపీ అభ్యర్థి అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆయనతో పాటు గూడూరులో కీలకస్థానంలో పనిచేస్తున్న అధికారి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆయన ఉద్యోగం వదిలి వైసీపీ తరఫునవ ఎన్నికలబరిలో నిలుస్తారనే చర్చ జరుగుతోంది. టీడీపీ తరఫున ప్రస్తుత ఇంచార్జ్ పాశం సునీల్ బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.

anamramanarayanareddy
వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆనం రాంనారాయణ రెడ్డి.. టీడీపీ ఇంచార్జిగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వెంకటగిరి నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. వైసీపీలో టెన్షన్ పుట్టిస్తున్న వెంకటగిరిలో ఏం జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో వెంకటగిరిలో అసలైన మజా కనిపించడం ఖాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆనం రాంనారాయణ ఉన్నారు. ఆయన ఫ్యాన్ పార్టీని వీడడం దాదాపు ఖాయంగా మారింది. కొంతకాలంగా సొంత పార్టీని ఇరుకునపెట్టేలా ఆనం వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయనను ఇంచార్జిగా తప్పించిన వైసీపీ అధిష్టానం.. నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అధికార పార్టీ నుంచి రామ్‌కుమార్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే వైసీపీ మీద ఆనం విమర్శల జోరు మరింత పెంచారు. వైసీపీ మీద ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఆనం ప్రయాణం ఎటు అనే ఆసక్తి కనిపిస్తోంది. ఒకవేళ ఆయన టీడీపీలోకి వచ్చినా.. వెంకటగిరి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతం వెంకటగిరి టీడీపీ ఇంచార్చిగా కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయనే అభ్యర్థిగా దింపే అవకాశాలు ఉన్నాయ్. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే.. ఆయనను లేదా వారి కుటుంబంలో ఒకరిని ఆత్మకూరు బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ.. వైసీపీ బలంగానే కనిపిస్తోంది. మరోసారి ఇక్కడ తమ జెండా పాతడం ఖాయమని ఆ పార్టీలో ధీమా కనిపిస్తోంది. ఐతే టీడీపీ, బీజేపీ జనసేన.. తిరుపతి ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయ్. ముగ్గురూ కలిసి గట్టిగా ప్రయత్నిస్తే.. వైసీపీని దెబ్బతీయొచ్చని మూడు పార్టీల నేతలు అనుకుంటున్నారు. ఐతే ఇక్కడ ఏ పార్టీకి ఎంపీ అభ్యర్థి అంటూ ఒకరు లేకపోవడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయ్.