Fish Tunnel In Vizag : విశాఖలో అండర్ వాటర్ టన్నెల్ .. 2 వేల రకాల అరుదైన, అద్భుత చేపల ప్రపంచం

అందాల విశాఖ మరో అద్భుత అనుభూతికి వేదికైంది. అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌ పోతో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రంగు రంగుల చేపలు.. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవ రాశులు అలా కళ్ల ముందు కదలాడుతుంటే వైజాగ్‌లో ఉన్నామా లేక మరేదైన లోకంలో ఉన్నామా అన్నట్టుగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎగ్జిబిషన్‌లో అరపైమా, లయన్, రెడ్ టైల్, ఆస్కార్ చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కరెంటులా షాక్‌ కొట్టే చేపలు ఈ ప్రదర్శనకు హైలెట్‌గా నిలుస్తున్నాయి.

Fish Tunnel In Vizag : విశాఖలో అండర్ వాటర్ టన్నెల్ .. 2 వేల రకాల అరుదైన, అద్భుత చేపల ప్రపంచం

Under water Fish Tunnel In Vizag

Fish Tunnel In Vizag : అందాల విశాఖ మరో అద్భుత అనుభూతికి వేదికైంది. టూరిజంలో తిరుగులేని వైజాగ్‌లో ఇప్పుడు అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌ పో మనల్ని మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రంగు రంగుల చేపలు.. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవ రాశులు అలా కళ్ల ముందు కదలాడుతుంటే వైజాగ్‌లో ఉన్నామా లేక మరేదైన లోకంలో ఉన్నామా అన్నట్టుగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎగ్జిబిషన్‌లో అరపైమా, లయన్, రెడ్ టైల్, ఆస్కార్ చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కరెంటులా షాక్‌ కొట్టే చేపలు ఈ ప్రదర్శనకు హైలెట్‌గా నిలుస్తున్నాయి.

రెండు, మూడు చేపలతో ఉన్న చిన్న అక్వేరియంలనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చిన్న చేపలు అటూ ఇటూ కదులుతుంటే కను రెప్ప వేయకుండా మత్స్య రాజాల ఆటను తదేకంగా చూస్తుండిపోతాం. అదే ప్రపంచంలో ఉన్న రకరకాల చేపలు ఒకే దగ్గర అదీ వందల సంఖ్యలో చూసే అవకాశం వస్తే.. ఆ అపురూప అనుభూతిని ఎంజాయ్‌ చేయటానికి రెండు కళ్లూ చాలవు.

ఇప్పుడు ఇలాంటి అనుభూతే విశాఖ వాసులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్ పో ఎగ్జిబిషన్ చూపరులను కట్టిపడేస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వందలాది మత్స్య జాతులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చాలా అరుదైన చేపలను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో నిర్వహించే అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ మన వైజాగ్‌లో ఏర్పాటు చేయటం విశేషం. 250 అడుగుల పొడవైన టన్నెల్‌లో 2 వేల రకాల చేపల సముదాయం, సముద్ర అడుగు భాగంలో ఉండే వింత జీవులు మన చుట్టూ కదలాడుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ఆక్వా ప్రదర్శనను వీక్షించిన సందర్శకులు చాలా గొప్ప అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఎంతగానో తమను ఆకట్టకుందని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కుటుంబాలు, బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడిపేందుకు చక్కని వేదికగా నిలుస్తోందని, ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా అలరిస్తుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.

సందర్శకులను ఇంతలా ఆకర్షించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. రకరకాల చేపలు, వాటి విశిష్టతలు వింటుంటే ఆ మజాయే వేరు. ఎగ్జిబిషన్‌లో అరపైమా అనే చేప చూపరులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఇది ఎక్కువగా అమెజాన్ నదిలో ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి చేపల్లో ఇది ఒకటి. అరపైమా చేప దాదాపు తొమ్మిది అడుగుల పొడవు పెరుగుతుందని చెబుతున్నారు. అమెజాన్‌లో మితిమీరిన చేపల వేట వల్ల వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీని ధర దాదాపు మూడున్నర లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఉన్న మరో రకం చేప లయన్. ఇది విషపూరిత చేప అట. ఇతర ప్రాణుల నుంచి తనను తాను రక్షించుకోడానికి ఈ చేప శరీరం చుట్టూ విషపూరితమైన ముళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఇక మరో చేప పేరు రెడ్ టైల్, పెద్ద పెద్ద మీసాలతో కనిపించే ఈ చేప మంచి నీళ్లలో మాత్రమే జీవిస్తుందని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ చేప జీవితకాలం 60 సంవత్సరాలు. ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మరో చేప ఆస్కార్. ఇది తెలివైన చేపగా చెబుతున్నారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆహారంతో మచ్చిక చేసుకుంటే పెంపకందారులకు చాలా త్వరగా దగ్గరవుతుందట.

ఎగ్జిబిషన్‌లో కొన్ని చేపలు కరెంట్‌లా షాకిస్తున్నాయి. ఇలా షాకిస్తున్న చేప పేరు ఎలక్ట్రిక్ ఈల్. దీన్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంటుంది. నల్లరంగులో చారలు కలిగి ఆకట్టుకునేలా ఉన్న ఈ చేపను కేరళ నుంచి తీసుకొచ్చారు. ఈ షాకింగ్ చేపను చూడడానికి సందర్శకులు క్యూ కడుతున్నారు.