Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్

ఆరుగురిని ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా హతమార్చిన విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పటినుంచో పగ పెంచుకున్న అప్పలరాజు.. ప్లాన్‌ ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది.

Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్

Vooru Vaada 60 Newsొొ

Uru Vada .. 60 News : విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో మరికొన్ని విషయాలు
ఆరుగురిని ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా హతమార్చిన విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పటినుంచో పగ పెంచుకున్న అప్పలరాజు.. ప్లాన్‌ ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది. పగను నిలువెల్లా నింపుకున్న అప్పలరాజు.. విచక్షణ కోల్పోయి రమణ కుటుంబం మొత్తాన్ని మర్డర్‌ చేశాడు. తెలతెలవారుతుండగానే.. ఆ ఇంటిని రక్తసిక్తం చేశాడు. గ్రామంలో కలకలం రేపాడు.

విశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు
విశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. హంతకుడి బంధువుల ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్‌ వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని ఆందోళనకు దిగారు. పోస్ట్‌మార్టమ్‌ చేసేందుకు కూడా వీలు లేదంటూ పట్టుబట్టారు. పదుల సంఖ్యలో అప్పలరాజు తమ్ముని ఇంటి వద్దకు చేరుకొని ధర్నా చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పెందుర్తిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే రమణ ఫ్యామిలీ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులంటున్నారు. గతంలో రమణ కుమారుడు విజయ్, అప్పలరాజు కుమార్తె మధ్య వివాహేతర సంబంధం ఉండేదని… దీంతో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై మూడేళ్ల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అప్పటినుంచి రమణ-అప్పలరాజు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం మధురవాడలో విషాదం
విశాఖపట్నం మధురవాడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మిధిలాపురి వుడా కాలనీలో ఉన్న ఆదిత్యా ఫార్చున్ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృత దేహాలను పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడం వల్లే వీళ్లు చనిపోయినట్టు భావిస్తున్నారు.

అయితే డెడ్‌ బాడీలపై గాయాలు ఉండటంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మృతులను 50 యేళ్ల సుంకర బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్, కశ్యప్‌లుగా పోలీసులు గుర్తించారు… కొన్ని నెలల క్రితం వరకూ విదేశాల్లో ఉన్న ఈ NRI కుటుంబం ఇటీవలే విశాఖకు మారింది. ఎవరైనా హత్య చేశారా లేక వీళ్లే ఆత్మహత్య చేసుకున్నారా అన్నది అంతుపట్టడం లేదు.

అనంతపురం జిల్లాలో నయా మోసం
అనంతపురం జిల్లాలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయలకు ప్రతి నెలా 30 వేలు ఇస్తామని, పది నెలల్లో మూడు లక్షలు ఇస్తామంటూ బురిడీ కొట్టించిన ముఠా మోసం బట్టబయలైంది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ పేరుతో ముఠా సభ్యులు కోట్లలో వసూలు చేశారు. దాదాపు 800 మంది నుంచి డిపాజిట్ల రూపంలో 300 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

అయితే కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని తెలుసుకున్న 100 మందికి పైగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. EBIDD ఫైనాన్స్‌ సర్వీసు పేరుతో సునీల్ అనే వ్యక్తి తన ఏజెంట్లతో లావాదేవీలు సాగించాడు. పెద్ద మొత్తాలు చెల్లించిన తర్వాత ఏజెంట్ల మొబైల్‌ పని చేయలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏజెంట్‌ మహేంద్రచౌదరితో పాటు మాధవి అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో హడలెత్తిస్తున్న సైకో
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ABM పాలెంలో మతిస్థిమితంలేని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. సైకోలా ప్రవర్తిస్తూ చేతికి ఏది దొరికితే అది తీసుకొని స్థానికులపై దాడికి పాల్పడాడు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడుభూముల వివాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తమ్మల చెరువులో పోడు భూముల వివాదం కొనసాగుతుంది. పోడుభూముల దగ్గరకు అటవీశాఖ అధికారులు రావడంతో.. గిరిజనులు గొడవకు దిగారు. తమ భూములు లాక్కోవడానికి మీరెవరంటూ వాగ్వాదానికి దిగడంతో.. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో సీఐడీ సోదాలు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో CID అధికారులు సోదాలు చేపట్టారు. వైద్య పరికరాలు.. మందుల కొనుగోలుపై అవకతవకలు జరిగాయని సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. CID, DSP నేతృత్వంలో ఈ సోదాలు జరిపారు. పలు రికార్డులను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాల జిల్లాలో కోవిడ్‌ సెంటర్లగా మూడు ఆస్పత్రులు
జగిత్యాల జిల్లాలో మూడు ఆస్పత్రులను కోవిడ్‌ సెంటర్లగా మార్చారు మంత్రి ఈటల రాజేందర్‌. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో .. మిత్ర, సులోచనతో పాటు కోరుట్లలోని ఆదిత్య హాస్పిటల్‌ను కోవిడ్‌ సెంటర్లగా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకలు కేటాయించామని చెప్పారు.

టీకా తీసుకున్న హోంమంత్రి సుచరిత
గుంటూరు జిల్లా సాయి భాస్కర్ ఆసుపత్రిలో హోంమంత్రి సుచరిత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టీకా తీసుకున్న బీజేపీ నేత రమేశ్‌
ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బీజేపీ నేత రమేశ్‌ కరోనా టీకా తీసుకున్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాక్సినేషన్ అభియాన్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. కరోనా రెండో దశలో తీవ్రంగా విస్తురిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టీకా కేంద్రాన్ని పరీశీలించిన జిల్లా కలెక్టర్ గౌతం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గౌతం పరీశీలించారు. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికి టీకా తీసుకునేలా.. చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం టీకా తీసుకున్న వైద్య సిబ్బందిని అభినందించారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్లను పరిశీలించిన రెవెన్యూ అధికారి శేషిరెడ్డి
ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్లను పరిశీలించారు రెవెన్యూ అధికారి శేషిరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ టీకా తీసుకున్న వారికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని చెప్పారు. కరోనా విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. వీలైనంత వరకు ప్రజలు దూర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తెలిపారు.

కరోనా రోగుల తాకిడి పెరిగింది : నోడల్‌ ఆఫీసర్‌
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కరోనా రోగుల తాకిడి పెరిగిందని నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గోపీచంద్‌ చెప్పారు. మూడు వందల బెడ్స్‌ ఫుల్‌ అయ్యాయన్నారు. వైరస్‌ తీవ్రత తగ్గిన రోగులను ఇతర ఆస్పత్రులతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించి కొత్త వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్‌ గోపీచంద్‌ సూచించారు.

కృష్ణా జిల్లాలో పుట్టిస్తోన్న కరోనా
కృష్ణా జిల్లాలో కరోనా కంగారు పుట్టిస్తోంది. వైరస్‌ వర్రీ పెరుగుతున్నా.. అటు వైద్యులు, ఇటు ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించకుండా ప్రజలు కరోనాబారిన పడుతుంటే.. వాడి తీసేసిన PPE కిట్లు, ఇంజక్షన్లు, ప్లాస్టిక్‌ కవర్లను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వ్యర్ధాలతో డస్ట్‌బిన్‌లు నిండిపోయి.. రోడ్లమీదకు వస్తున్నా పట్టించుకోవడం లేదు.

కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కొరడా
కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ములుగు జిల్లా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 82 ప్రకారం ..మాస్క్‌ ధరించని వారికి వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని.. లేదంటే ఫైన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా చేజర్‌ ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం
నెల్లూరు జిల్లా చేజర్‌ ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఓ టీచర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అప్రమతమైన అధికారులు.. స్కూల్‌కు సెలవు ప్రకటించారు. మరోవైపు స్కూల్ టీచర్స్‌.. విద్యార్థులకు రేపు కరోనా పరీక్షలు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. రెండు రోజుల్లో నలుగురు వ్యక్తులు కరోనా బారినపడి మృతి చెందడంతో.. జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4వందలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు..తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో 325 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 121 మందికి వైరస్‌ సోకింది. చొప్పదండి మండలం పెద్ద కుర్మాపల్లిలో 43 మందికి వైరస్‌ సోకడంతో గ్రామంలో లాక్‌డౌన్‌ విధించారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 296 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇద్దరు మృతి చెందారు.

ఆదోని కస్తూరిబాయి పాఠశాలలో కరోనా కలకలం
కర్నూలు జిల్లా ఆదోనిలోని కస్తూరిబాయి పాఠశాలలో కరోనా కలకలం రేపింది. స్కూల్‌లోని 15 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా… ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. పాఠశాల చుట్టూ శానిటైజర్‌ పిచికారీ చేస్తున్నారు.

బుక్కపట్నంలోని బాలికల పాఠశాలలో కరోనా
అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని బాలికల పాఠశాలలో కరోనా విజృంభిస్తుంది. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు పాఠశాల పరిసర ప్రాంతాల్లో శానిటైజర్‌ పిచికారీ చేయిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థులను కార్వంటైన్‌లో ఉంచి.. తగు జాగ్రత్తలు తీసుకుంటామని MEO తెలిపారు.

అంత్యక్రియలకు ముందుకు రానీ జనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపుపేటలో మానవత్వం మంట కలిసింది. అనారోగ్యంతో వృద్ధురాలు మృతి చెందింది. అయితే కరోనా భయంతో అంత్యక్రియలు జరిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

టీకా తీసుకున్న రెండు రోజులకే సర్పంచ్‌ మృతి
రంగారెడ్డి జిల్లా కేశంపెట్ మండలం లింగంధనలో టీకా తీసుకున్న రెండు రోజులకే సర్పంచ్‌ మయూరి చనిపోవడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రెండు రోజుల నుంచి అమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో అమె మృతి చెందింది. టీకా కారణంగానే అమె చనిపోయిందని.. కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు
ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. జిల్లాలోని గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాల్లో పడిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి తడిచిపోతే.. వరి పొలాలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కంది పంట దెబ్బతింది. టమాట తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో సాగుకు చేసిన ఖర్చులు కూడా వచ్చే అవకాశంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతులకు నష్టం జరిగింది. వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో పడిన వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. వరి, మొక్కజొన్నకు మొలకలు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తడిచిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

అశ్వారావుపేటలో అకాల వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టం పోయారు. రెండు రోజులపాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో మామిడి, జీడిమామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ములకలపల్లిలో యాసంగి పంట చేతికి వచ్చే సమయానికి ధ్యానం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు.

భారీ వర్షాలకు నేలపాలైన ఆరటి తోట
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లిలో కురిసిన భారీ వర్షాలకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన అరటి తోట నేలపాలు కావడంతో లబోదిబోమంటున్నారు. ఈదురుగాలుల బీభత్సానికి అరటి తోట మొత్తం పడిపోయింది. కాయ దశలో ఉన్న తోట పడిపోవడంతో సుమారు 15 లక్షల రూపాయల వరకు పంటనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

భారీ వర్షాలకు కూలిన ఇంటి పైకప్పు
ప్రకాశం జిల్లా LBSనగర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. అప్రమత్తమైన కుటుంబ స్యభులు.. స్వల్పగాయాలతో బయటపడ్డారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ..పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మార్కాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

జోగిపేటలో అగ్నిమాపక శాఖ విన్యాసాలు
సంగారెడ్డి జిల్లా అందోల్ మండ‌లం జోగిపేటలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ.. ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడమే.. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిస్తే.. సంఘటనాస్థలంలో సిద్ధంగా ఉంటామని చెప్పారు.

పెనుకొండలో అగ్నిమాపకశాఖ వారోత్సవాలు
అనంతపురం జిల్లా పెనుకొండలో అగ్నిమాపకశాఖ వారోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. అగ్నిప్రమాదం సంభవిస్తే.. వెంటనే 101కి కాల్‌ చేయాలన్నారు. అలాగే ఫైర్‌ వచ్చేముందు.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయంపై వివరించారు. వేసవికాలంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతాయని.. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నాటుసారా స్థావరాలపై దాడులు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చెన్నంపల్లిలో నాటుసారా స్థావరాలపై SEB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో 2వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం నేరమన్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తే.. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని SEB అధికారులు హెచ్చరించారు…

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం
కృష్ణా జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుడివాడ, దొండపాడు గ్రామాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరకడం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు.

నాటు తుపాకి మిస్‌ఫైర్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కాల్పుల కలకలం రేపింది. నాటు తుపాకి మిస్‌ ఫైర్‌ కావడంతో లక్ష్మీకళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జీడిమామిడి తోటలో పనిచేస్తున్న అమెను.. జంతువు అనుకుని రాంబాబు అనే వ్యక్తి నాటు తుపాకితో కాల్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాంబాబును అరెస్ట్‌ చేశారు.

షేషెంట్‌ తల్లిపై సెక్యూరిటీ దాడి
ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పటల్‌ ఎదుట షేషెంట్‌ బంధువులు ఆందోళన చేపట్టారు. టిఫిన్‌ తీసుకువెళ్తుండగా.. పేషెంట్‌ తల్లిపై సెక్యూరిటీ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయకావడంతో ఆస్పత్రి తరలించారు. సెక్యూరిటీపై అధికారులు చర్యలు తీసుకోవాలని సమీప బంధువులు డిమాండ్‌ చేశారు.

బాలిక ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రాజానగరంలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో చదువుకుంటున్న మౌనిక..గత కొద్ది రోజులగా ఆరోగ్యం సరిగాలేకపోవడంతో..తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు.

కన్న కొడుకును హత్య చేసిన తండ్రి
నాగర్ కర్నూల్ జిల్లా మంతటిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును హత్య చేశాడు ఈ కసాయి తండ్రి. తండ్రి శివశంకర్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వారు నిద్రిస్తున్న సమయంలో పిల్లల మని కట్టును కొశాడు. అనంతరం తాను కూడా చనిపోతున్నానని తన తల్లికి ఫోన్‌ చెప్పాడు. ఈ ఘటనలో ఓ కుమారుడు చనిపోగా.. మరో కుమారుడు..ప్రాణాలతో బయట్టపడ్డాడు.

అయితే భర్త వేధింపులు భరించలేక గతంలో తన భార్య కూడా పురుగుల మందు తాగి చనిపోయింది. తల్లి లేని పిల్లలకు అండగా ఉండాల్సి తండ్రి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శివశంకర్‌ కోసం గాలిస్తున్నారు. అసలు పిల్లలను ఎందుకు హత్య చేయాలనుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తప్పిన పెను ప్రమాదం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ కాకతీయ థర్మల్‌ పపర్‌ ప్రాజెక్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. జనరేటర్‌ విభాగంలో అయిల్‌ లీకేజ్‌ కావడంతో.. అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పిందని లేదంటే.. భారీ ప్రాణ నష్టం జరిగేదని సిబ్బంది తెలిపారు. అనంతరం సిబ్బందిని బయటకు పంపి మరమ్మతులు చేపట్టారు.

కరెంట్‌ షాక్‌తో మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం ఆదర్శనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రవీందర్‌ అనే వ్యక్తి ఓ ఇంట్లో పాలిష్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు.

ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్‌ పెద్దమ్మ ఆలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలయం బయట తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమచారంలో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నాగర్‌ కర్నూల్‌ జిల్లా చెందిన రాజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కారును.. వెనక నుంచి వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

కారును ఢీకొని అంబులెన్స్‌ బోల్తా
హైదరాబాద్‌ తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ కూడలిలో రోడ్‌ ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో రోగులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అంబులెన్స్‌ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తాపడ్డ అంబులెన్స్‌ను క్రేన్‌ సాయంతో పక్కకు తీసి.. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాజారాంనగర్‌లోని SBI బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంక్‌లోకి వచ్చిన సిబ్బంది కరెంట్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

దివ్యాంగులకు లాప్‌టాప్‌.. సైకిల్‌ ట్రాలీ.. మొబైల్స్‌ ఉచితంగా పంపిణీ
సిద్ధిపేట జిల్లాలో దివ్యాంగులకు అండగా నిలిచారు మంత్రి హారీశ్‌రావు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో లాప్‌టాప్‌.. సైకిల్‌ ట్రాలీ.. మొబైల్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. 516 మంది దివ్యాంగులకు 80లక్షల విలువ చేసే ఉపకరణాలు అందించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం అనేక సదుపాయలు తీసుకువచ్చామన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు 80శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.

చెర్లబూత్కూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం
కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌.. అనేక పథకాలను ప్రవేశపట్టారన్నారు. ఇప్పటీవరకు కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. అధికారులు సూచించిన మేరకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వద్దకు రావాలన్నారు.

జోగిపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌. ధాన్యం కొనుగోలు చేసిన 78గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు చెల్లిస్తారన్నారు. రైతు సంక్షేమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. రైతుల వ‌ద్దకే వ‌చ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పై బండి సంజయ్‌ మండిపాటు
పవిత్రమైన నాగార్జునసాగర్‌ను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అపవిత్రం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలు సాగర్‌లోనూ పునరావృతం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సాగర్‌కు చేసిందేం లేదని ఆరోపించారు.

తెలంగాణ మున్సిపల్‌ పోరుకు నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహించి, మే 3న కౌంటింగ్‌ జరుపుతామని SEC ప్రకటించింది.

వాలంటీర్లకు అవార్డుల అందజేత
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వాలంటీర్ వ్యవస్థలో బాగా పనిచేసిన వారిని సన్మానించారు జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మిషా. అనంతరం వారికి అవార్డులను అందజేశారు. వాలంటీర్ వ్యవస్థను సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలానే అందరూ సేవా వజ్ర అవార్డుకు పోటీపడాలని.. వాలంటీర్లుకు సూచించారు.

ఫోర్ వే లైన్ బ్రిడ్జిని పరిశీలించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కొదురుపాకలో ఫోర్ వే లైన్ బ్రిడ్జిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఫెన్సింగ్ లైటింగ్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు R&B అధికారులు అంచనాలు రూపొందించారు. త్వరలోనే 5 కోట్ల రూపాయలను మంజూరు చేసేలా..ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతానని చెప్పారు.

దశాబ్దాల స్వప్నం సాకారం
వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రజల దశాబ్దాల జల స్వప్నం నెరవేరింది. బీడు భూములకు సాగునీరు అందిస్తామన్న నేతల హామీ కార్యరూపం దాల్చింది. ములుగు జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన ఇంటేక్‌ వెల్‌ నుంచి విడుదల చేసిన నీరు శతాబ్దాల చరిత్ర కలిగిన పాకాల సరస్సుకు చేరింది. ప్రజా ప్రతినిధులు, రైతులు గంగ పూజలు చేసిన గోదావరి జలాలకు స్వాగతం పలికారు.

వెంకటగిరిలో చేనేత ఆత్మీయ సదస్సు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వహించారు.. టీడీపీ నేత కురుగొండ్ల రామకృష్ణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గంజి చిరంజీవి పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ బలపరిచిన పనబాక లక్ష్మిని.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వైసీపీ కరప్రతాలు పంచుతూ పట్టుబడ్డ వాలంటీర్‌
నెల్లూరు జిల్లా రాపూరు మండల కొత్తపేటలో వైసీపీ కరప్రతాలను పంచుతున్న వాలంటీర్‌ను పట్టుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను మభ్యపెడుతుంది. అనుమానం రావడంతో వాలంటీర్‌ బ్యాగ్‌ చెక్‌ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచారంటూ..వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేత కూన రవికుమార్‌కు కోర్టులో ఊరట
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు రాజాం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. ప్రతి నెల రెండో శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు పొందూరు పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. అంతకుముందు నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కూన రవికుమార్‌.. పొందూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా బెయిల్‌ మంజూరైంది.

మేకల పాలవుతున్న పల్లె ప్రకృతి వనం మొక్కలు
ములుగు జిల్లా కన్నాయిగూడెంలో పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు మేకల పాలవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మొక్కలన్నీ పాడైపోతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత ఉన్నాతధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గోమాతకు సీమంతం
విజయవాడలో గోమాతకు గుణదలకు చెందిన ఆంజనేయప్రసాద్ అనే రైతు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ముద్దుగా పెంచుకుంటున్న లచ్చమ్మ అనే ఆవుకు శాస్త్రోక్తంగా సీమంతం చేశాడు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న మహిళలు పాల్గొని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతను పూజించడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన వాళ్లవుతామని చెప్పారు.

కళ్యాణదుర్గంలో అంగరంగ వైభవంగా తిరునాళ్లు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిఏటా ఉగాది పర్వదినం తర్వాత అక్కమాంబ దేవత తిరునాళ్లు జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఇందుకోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..ఆలయాన్ని వైభవంగా ముస్తాబు చేస్తారు. అనంతరం అమ్మవారికి పానకాలు సమర్పిస్తారు.

గర్రెపల్లిలో ఎడ్లబండ్ల జాతర
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఎడ్లబండ్ల జాతర అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న వేడుకలో.. ఎడ్లబండ్లతో గ్రామదేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతరలో పాల్గొన్న రైతులకు బట్టలు పంపిణీ చేశారు. కరోనా కాలంలో ప్రజలందరిని కాపాడాలంటూ గ్రామదేవతలను వేడుకున్నారు

శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదం
రంగారెడ్డ జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ఆనంద్‌మోహన్‌ను ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్‌ వైపు నుంచి కూకట్‌పల్లి వెళ్తున్న ఆనంద్‌మోహన్‌ నిద్రమత్తులో నడపడంతో కారు అదుపు తప్పింది. ప్రమాదంలో మోహన్‌కు స్వల్ప గాయాలు కాగా.. కారు పూర్తిగా దెబ్బతినింది.