Visakha Oxygen Plant : ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్.. అందరి దృష్టంతా విశాఖ ఆక్సిజన్ ప్లాంట్ పైనే

కరోనా సెకండ్‌ వేవ్‌లో రోగులకు ప్రాణవాయువు అవసరం మరింత ఎక్కువగా మారింది. అందరి దృష్టి ఉక్కు కర్మాగారాల్లోని ఆక్సిజన్‌ ప్లాంట్లపై పడింది.

Visakha Oxygen Plant : ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్.. అందరి దృష్టంతా విశాఖ ఆక్సిజన్ ప్లాంట్ పైనే

Visakha Oxygen Plant

Visakha Oxygen Plant : భారత్ లో మళ్లీ కరోనా విజృంభించింది. దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో రోగులకు ప్రాణవాయువు అవసరం మరింత ఎక్కువగా మారింది. కానీ… దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఉత్పత్తి అయ్యే వాయువే సరిపోయేది. ఇప్పుడు ప్రాణవాయువుకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. దీంతో… అందరి దృష్టి ఉక్కు కర్మాగారాల్లోని ఆక్సిజన్‌ ప్లాంట్లపై పడింది.

నాణ్యమైన స్టీల్‌ తయారీలో ఆక్సిజన్‌ పాత్ర ఎంతో కీలకం. క్లుప్తంగా చెప్పాలంటే… ఇనుప ఖనిజం నుంచి ఉక్కును తయారు చేసినప్పుడు… అందులో కార్బన్‌ అధికంగా ఉంటుంది. కార్బన్‌ వల్ల ఉక్కు పెళుసుగా మారుతుంది. ఈ కార్బన్‌ను తొలగించేందుకు ఆక్సిజన్‌ను పంపిస్తారు. ఎంత నాణ్యమైన ఆక్సిజన్‌తో ఈ ప్రక్రియ నిర్వహిస్తే… అంత నాణ్యమైన స్టీల్‌ తయారవుతుంది. ఈ రెండు ప్రక్రియలకు విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టింది పేరు.తమ సొంత అవసరాల కోసం విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంది. గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, మిగిలిన 1 శాతం ఇతర ఆర్గాన్‌ వాయువులు ఉంటాయి. ఈ వాయువులను ‘ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంట్‌’లో వేటికి అవిగా వేరు చేస్తారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆక్సిజన్‌ తయారీకి ఐదు యూనిట్లు ఉన్నాయి. అందులో 550 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవి మూడు కాగా, మరో రెండు 600 టన్నుల చొప్పున ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఇక్కడ రోజుకు సగటున 2,600 టన్నుల ఆక్సిజన్‌ తయారు చేయగలరు. అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవడానికి వీలుగా 100 టన్నుల ఆక్సిజన్‌ను ద్రవ రూపంలో నిల్వ చేసి ఉంచుతారు. దీనినే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) అంటారు. గత ఏడాది కరోనా సమయంలో ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నుంచి 8,842 టన్నుల ఎల్‌ఎంఓ సరఫరా చేశారు. అప్పట్లో సామాజిక బాధ్యత కింద టన్ను రూ.6,500 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు ఆ ధరను రూ.11,700కు పెంచారు.

ఆంధ్రప్రదేశ్‌లో అచ్చంగా ఆస్పత్రుల అవసరాలకు ఆక్సిజన్‌ తయారుచేసే పరిశ్రమలు రెండే ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో, మరొకటి విశాఖ జిల్లా పరవాడలో. ఇవి ఉత్తరాంధ్రలోని ఆస్పత్రుల అవసరాలకు సరిపడా మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వాటి ఉత్పత్తి పెంచడం కష్టమే. కానీ… స్టీల్‌ప్లాంటులో ఆ అవకాశం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంటు ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 2,600 టన్నులు. కానీ, అవసరాల మేరకే తప్ప, గరిష్ఠ స్థాయిలో ఆక్సిజన్‌ను తయారు చేయరు. ఒకవేళ… ఈ ప్లాంట్లలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసినా రవాణా అతిపెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 200 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ట్యాంకర్ల ద్వారా తీసుకువెళ్లే ఎల్‌ఎంఓను ఆస్పత్రులకు నేరుగా సరఫరా చేయరు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వారు ఆ ట్యాంకర్‌ నుంచి చిన్న నిలువు సిలిండర్లలోకి బదిలీ చేసి అందిస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ల సామర్థ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. స్టీల్‌ప్లాంటు నుంచి రోజుకు 100 టన్నుల ఎల్‌ఎంఓ తీసుకువెళితే… పది వేల సిలిండర్లను నింపవచ్చునని ఓ అఽధికారి తెలిపారు. అత్యవసరమైతే మరో 100 టన్నుల ఆక్సిజన్‌ కూడా ఇస్తామని, కానీ… దానిని తీసుకువెళ్లడమే ప్రధాన సమస్య అని తెలిపారు.

మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో… విశాఖ నుంచి అక్కడికి ఆక్సిజన్‌ తరలిస్తున్నారు. ఏడు ఎల్‌ఎంవో ట్యాంకర్లతో ప్రత్యేక గూడ్స్‌ రైలు ఒకటి సోమవారం రాత్రి ముంబైలోని కలంబోలి నుంచి బయలుదేరింది. బుధవారం ఉదయానికి అది రాయపూర్‌లో ఉంది. విశాఖకు రాగానే… ఏడు ట్యాంకర్లలో 105 టన్నుల ఎల్‌ఎంవోను నింపి పంపిస్తారు. దీనికోసం స్టీల్‌ప్లాంటులో ప్రత్యేకంగా ర్యాంప్‌ కూడా నిర్మించారు.లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా చాలా క్లిష్టమైన ప్రక్రియ.

ఈ ద్రావణాన్ని మైనస్‌ 185 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రవాణా చేయాలి. ఇందుకు ప్రత్యేకమైన ట్యాంకర్లు అవసరం. ఎల్‌ఎంవో ట్యాంకర్లు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించ కూడదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. ఎల్‌ఎంవో రవాణాలో ఇలాంటి అనేక నిబంధనలున్నాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కావడంతో… చిన్న ప్రమాదం జరిగినా తీవ్రమైన నష్టం ఉంటుంది కాబట్టే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది.